విచ్చలవిడి రుణాలతో కుదేలైన బ్యాంకులు..

30 Oct, 2018 17:52 IST|Sakshi
ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (ఫైల్‌ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకులు మొండిబకాయిలతో సతమతమయ్యేందుకు 2008 నుంచి 2014 వరకూ విచ్చలవిడిగా రుణాలు ఇవ్వడమే కారణమని ఆర్థిక మం‍త్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. బ్యాంకులు విచక్షణ లేకుండా రుణాలు జారీ చేస్తుంటే అడ్డుకోవడంలో ఆర్బీఐ విఫలమైనందునే ప్రస్తుతం బ్యాంకింగ్‌ పరిశ్రమలో ఎన్‌పీఏ సంక్షోభం నెలకొందన్నారు. ద్రవ్య విధాన నిర్ణేతల స్వతంత్రతపై ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య తీవ్రస్ధాయిలో విభేదాలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ప్రపంచ ఆర్థిక మందగమనం అనంతరం 2008 నుంచి 2014 మధ్య ఆర్థిక వ్యవస్థను కృత్రిమంగా పెంచేందుకు బ్యాంకులను విపరీతంగా రుణాలు ఇవ్వాలని అప్పటి పాలకులు కోరారని ఇండియా లీడర్‌షిప్‌ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ జైట్లీ పేర్కొన్నారు. ఈ క్రమంలో రుణ వృద్ధి సగటు 14 శాతం కాగా, ఓ ఏడాది అసాధారణంగా 31 శాతానికి ఎగబాకిందన్నారు.

బ్యాంకులు అడ్డగోలుగా రుణాలిస్తుంటే ఆర్బీఐ అడ్డుకోలేదన్నారు. మరోవైపు బ్యాంకింగ్‌ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులను నియంత్రించేందుకు ఆర్బీఐకి మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ ఆచార్య కేంద్రాన్ని కోరారు. స్థూల ఆర్థిక స్థిరత్వం సాధించేందుకు ఆర్బీఐకి విస్తృత అధికారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు