సమాధులపై రామాలయం నిర్మిస్తారా?

18 Feb, 2020 20:30 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో స్థానిక ముస్లిం ప్రతినిధులు ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ పరశరన్‌కు ఓ లేఖ రాశారు. బాబ్రీ మసీదు నిర్మాణ ప్రాంతంలో ముస్లింల సమాధులు ఉన్నాయని, వాటిపై రామ మందిరాన్ని నిర్మించడం సనాతన ధర్మానికి విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా ఆలయ నిర్మాణానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన నేప‌థ్యంలో అయోధ్యలో రామాల‌య నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ట్రస్టును ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ఆ న‌గ‌ర ముస్లిం ప్రజ‌లు ట్రస్టు అధిప‌తి ప‌ర‌శ‌ర‌న్‌కు ఫిబ్రవరి 15న లేఖ రాశారు. రామాల‌య నిర్మాణం స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధంగా ఉంద‌ని ఆ లేఖ‌లో ముస్లింలు ఆరోపించారు. ధ్వంసం చేయ‌బ‌డ్డ బాబ్రీ మ‌సీదు ప్రాంతంలో ముస్లింల స‌మాధులు ఉన్నాయ‌ని, ఆ స‌మాధుల‌పై రామాల‌యాన్ని నిర్మించ‌డం హిందూ స‌నాత‌న ధ‌ర్మానికి విరుద్ధమ‌ని ముస్లిం తరఫు న్యాయవాది ఎంఆర్‌ శంషాద్‌ పేర్కొన్నారు.

1885లో జ‌రిగిన అల్లర్లలో సుమారు  75 ముస్లింలు చ‌నిపోయార‌ని, వారి స‌మాధులు అక్కడే ఉన్నాయ‌ని ట్రస్ట్‌ దృష్టికి తీసుకెళ్లారు. బాబ్రీ మ‌సీదు నిర్మించిన ప్రాంతాన్ని శ్మశాన‌వాటిక‌గా వాడార‌ని, అలాంటి చోట రామాల‌యాన్ని ఎలా నిర్మిస్తార‌ని ఆ లేఖ‌లో ప్రశ్నించారు.  ముస్లింల స‌మాధుల‌పై రాముడి జ‌న్మస్థాన ఆల‌యాన్ని నిర్మిస్తారా, ఇది హిందూ ధ‌ర్మాన్ని ప‌రిర‌క్షిస్తుందా? దీనిపై నిర్ణయం తీసుకోవాల‌ని లేఖ‌లో కోరారు. మొత్తం 67 ఎక‌రాల భూమిని ఆల‌య నిర్మాణం కోసం వాడుకోవడాన్ని ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు న్యాయ‌వాది లేఖలో తెలిపారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు