‘అసెంబ్లీ తీర్మానం చెత్తబుట్టకే పరిమితం’

17 Mar, 2020 15:51 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టంతో(సీఏఏ) దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ సీఏఏ, ఎన్సార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహం ముందు బండి సంజయ్‌ నేతృత్వంలో బీజీపీ మౌన దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబురావు, బీజేపీ అఖిల భారత పదాధికారి కామర్సు బాల సుబ్రహ్మణ్యం, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఏఏ ఎవరికి వ్యతిరేకం కాదని, సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా కనువిప్పు తెచ్చుకోవాలని అన్నారు. (ఆ తీర్మానం.. దేశ ద్రోహమే)

వేరే దేశం నుంచి ముస్లింలు వస్తే దేశంలో ఉన్న ముస్లింలు పొట్టకొట్టే ప్రయత్నం చేసినట్లే అవుతుందని ఆయన అన్నారు. ముస్లిం ఓట్ల కోసమే వ్యతిరేక తీర్మాణం చేశారని విమర్శించారు. కేసీఆర్‌ అయినా, ఓవైసీ అయినా జాతీయ పౌర పట్టికలో(ఎన్పీఆర్‌) నమోదు చేయించుకోవాల్సిందేనని పేర్కొన్నారు. దేశం గురించే ఆలోచించే సమయం కేసీఆర్‌కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణలోరైతులు, విద్యార్థులు, ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా కేసీఆర్‌ పట్టించుకోలేదని, సీఏఏ, ఎన్పీఆర్‌ అమలు జరిగి తీరుతుందని అన్నారు. అసెంబ్లీ చేసిన తీర్మానం చెత్తబుట్టకే పరిమితం అవుతుందని బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. మరోవైపు ఎన్నార్సీ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు సిరిసిల్లలో సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా