భారత్ లో లగ్జరీ రైళ్ళకు కష్టకాలం!

16 Apr, 2016 16:42 IST|Sakshi
భారత్ లో లగ్జరీ రైళ్ళకు కష్టకాలం!

భారత్ లో లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. రాజభోగాల్లాంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పలు రాష్ట్రాల్లో తిరుగుతున్న నాలుగు ట్రైన్లకు ఇక కాలం చెల్లనుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పర్యాటక ప్రియులకోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్  ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ప్రముఖమైన 'ప్యాలస్ ఆన్ వీల్స్' గతవారం తొలిసారిగా చక్రాలు నిలిచిపోవడం  అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రారంభించిన 34 ఏళ్ళలో ఎప్పుడూ ఆగని ఈ ట్రైన్.. ప్రయాణీకులు లేని కారణంతో నిలిచిపోవడం ఇప్పుడు లగ్జరీ ట్రైన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.

విలాసవంతమైన సౌకర్యాలకు అనుగుణంగానే లగ్జరీ ట్రైన్లలో ఉండే ఛార్జీలు కూడ సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న నాలుగు లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లు ప్రయాణికుల్లేక బోసిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు తలలు పట్టుకుంటున్నాయి. భవిష్యత్తు ఏమిటోనన్న అయోమయ స్థితిలో పడ్డాయి. ఇండియన్ రైల్వే మొదటిసారి ప్రవేశ పెట్టిన ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ 'ప్యాలెస్ ఆన్ వీల్స్'  సహా మరో మూడు లగ్జరీ ట్రైన్లు... ప్రస్తుతం తక్కువ ఆక్యుపెన్సీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం 18 బుకింగ్స్ మాత్రమే జరగడంతో గతవారం ప్యాలెస్ ఆన్ వీల్స్ ను మొదటిసారి నిలిపివేశారు. అలాగే రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ కూడ పీక్ టూరిస్టు సీజన్ అయిన గత డిసెంబర్ లో బుకింగ్స్ లేక రెండు ట్రిప్ లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2014-15 లో 35 నుంచి 40 శాతం, అంతకు ముందు 2011-12 లో ఇంకా 60 శాతం వరకూ ప్రయాణీకుల సంఖ్య తగ్గి, ఆక్యుపెన్సీ సమస్య ఏర్పడటంతో అప్పట్లో కొన్ని ట్రిప్పులను కూడ కుదించేశారు. వాయువ్య, మధ్య భారతదేశంలోని 12 ప్రాంతాలను కవర్ చేసే  అత్యంత విలాసవంతమైన మహారాజా ఎక్స్ ప్రెస్ లో మాత్రమే గత ఐదేళ్ళలో 15 శాతం వరకూ ప్రయాణీకుల స్థిరమైన పెరుగుదల కనిపించింది. 2011 నుంచి ఇప్పటివరకూ ఈ మహారాజా ఎక్స్ ప్రెస్ అనేక ట్రావెల్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ, సూపర్ రిచ్ ప్రాధాన్యతలున్న జాబితాలో మాహారాజా ఎక్స్ ప్రెస్ నాల్గవ స్థానంలో కూడ నిలిచింది. అలాగే లాటిన్ అమెరికాలో ఈ ఎక్స్ ప్రెస్ ను నడపాలంటూ మెక్సికో కూడ అభ్యర్థించింది.

అత్యంత సంపన్నులైన వారికి అనువుగా.. ఖరీదైన, విలాసవంతమైన ఐదు రైళ్ళను అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టారు. ఒక్కరాత్రి ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి ఈ లగ్జరీ ట్రైన్లలో మార్గం, సీజన్, రైలును బట్టి ఒక్కో వ్యక్తికి సుమారు 500 డాలర్లు, అంటే సుమారు 30 వేల రూపాయల నుంచి 1800 డాలర్లు అంటే సుమారు లక్ష రూపాలకు పైగా ఛార్జీలు ఉంటాయి. దేశంలోని మొత్తం ఐదు లగ్జరీ ట్రైన్లలో తొలి లగ్జరీ ట్రైన్...  ప్యాలెస్ అన్ ది వీల్స్ ను మూడు దశాబ్దాలక్రితం  రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్  కార్పొరేషన్ (ఆర్టీడీసీ) ప్రారంభించింది. తర్వాత రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ను కూడ ప్రారంభించిన ఆర్టీడీసీ.. ఇంచుమించు రెండు రైళ్ళనూ ఢిల్లీ నుంచి ప్రారంభమై రాజస్థాన్, ఆగ్రాలను కవర్ చేసేట్లు  ఒకే మార్గంలో నడుపుతోంది. ఆ తర్వాత మహరాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ప్రారంభించిన డెక్కన్ ఒడిస్సీ... మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లను కవర్ చేస్తుంది. కర్నాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కర్నాటక నుంచి గోవా వరకూ  నడిపే  'గోల్డెన్ ఛరియట్'.. దక్షిణ ప్రాంతంలో నడిచే ఒకేఒక్క లగ్జరీ ట్రైన్ గా చెప్పాలి. ఈ మొత్తం అన్ని లగ్జరీ ట్రైన్లలోనూ సెంట్రల్ ఎయిర్ కండిషన్, ఇంటర్ కమ్, టీవీ, వైఫై, కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతోపాటు... పాంట్రీ, లాంజ్, మ్యూజిక్, మనీ ఎక్సేంజ్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అంతేకాక పర్యాటకులకు అనువుగా కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, దేశీయ ప్రత్యేక వంటకాలను వడ్డించే ప్ర్తత్యేక రెస్టారెంట్లు, బార్లు తో పాటు ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందుబాటులో అటెండెంట్స్ కూడ ఉంటారు. ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకునే ఈ లగ్జరీ రైళ్ళు.. సుమారు 14 నుంచి 19 బోగీలను కలిగి ప్రయాణీకులకు భారత రాచరిక మర్యాదలతో ఎర్రతివాచీ స్వాగతం పలుకుతాయి.

అయితే తాజాగా విదేశీయులు, ఎన్నారైలు వారి దేశాలనుంచే క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించిన భారత రైల్వే... లగ్జరీ ట్రైన్ల ఆక్యుపెన్సీ సమస్య తీర్చేందుకు ఇకపై ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు