తృణమూల్‌ దౌర్జన్యం : బీజేపీ మహిళా అభ్యర్ధి కన్నీరు

12 May, 2019 10:36 IST|Sakshi

కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌లోనూ పశ్చిమ బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మాజీ ఐపీఎస్‌ అధికారి, పశ్చిమ బెంగాల్‌లోని ఘతాల్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి భారతి ఘోష్‌పై ఓ పోలింగ్‌ కేంద్రం వద్ద దాడి జరిగింది. పోలింగ్‌ ఏజెంట్‌తో కలిసి బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన భారతి ఘోష్‌ను తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా విభాగం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఘోష్‌ను చుట్టుముట్టిన తృణమూల్‌ శ్రేణులు ఆమెను తోసివేయడంతో కిందపడిపోయారు.

తనపై తృణమూల్‌ కార్యకర్తలు దాడి చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఆరో దశ పోలింగ్‌ సందర్భంగా బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా మొబైల్‌ ఫోన్‌తో పోలింగ్‌ కేంద్రంలోకి ప్రవేశించిన భారతి ఘోష్‌ వీడియో తీశారనే ఆరోపణలపై ఈసీ సంబంధిత పోలింగ్‌ అధికారులను నివేదిక కోరింది. కాగా పోలింగ్‌కు ముందు జరిగిన ఘర్షణలో ఓ బీజేపీ కార్యకర్త మరణించగా, పలువురు బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తలు గాయపడ్డారు.

మరిన్ని వార్తలు