వేధించే ఎన్‌ఆర్‌ఐ మొగుళ్లపై కొరడా

12 Feb, 2019 02:37 IST|Sakshi

పెళ్లయిన 30 రోజుల్లో రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి 

లేకుంటే పాస్‌పోర్ట్‌ రద్దు, ఆస్తుల జప్తు 

న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు(నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌–ఎన్‌ఆర్‌ఐ) ఇకపై తమ పెళ్లిని తప్పకుండా రిజిస్టర్‌ చేయాల్సిందే. రిజిస్ట్రేషన్‌ చేయకపోతే వారి పాస్‌పోర్టును జప్తుచేసే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో రద్దుచేసే వీలుంది. భారతీయ పౌరురాలిని లేదా తోటి ఎన్‌ఆర్‌ఐను పెళ్లాడే ప్రతీ ఎన్‌ఆర్‌ఐ పురుషుడు 30రోజుల్లోపు మ్యారేజ్‌ను రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రతిపాదిస్తూ కేంద్రం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. పెళ్లి పేరుతో ఎన్‌ఆర్‌ఐ అబ్బాయిలు చాలామంది అమ్మాయిలనుచేసిన ఘటనల నేపథ్యంలో ఈ బిల్లు తెచ్చారు. ఎన్‌ఆర్‌ఐల వివాహ రిజిస్ట్రేషన్‌ ముసాయిదా బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు.

►ఇకపై మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్‌ చేయకుంటే అది చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. 

►ఆ ఎన్‌ఆర్‌ఐకి చెందిన స్థిర, చరాస్థుల జప్తుకు సైతం కోర్టులు ఆదేశించవచ్చు. 

►సంబంధిత కేసుల విషయంలో విదేశాంగ శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక్‌ వెబ్‌సైట్‌ ద్వారా నిందితులకు సమన్లు, వారెంట్లు జారీచేయనున్నారు. 

►వివాహం భారత్‌లో జరిగితే ఇక్కడి చట్టాలకనుగుణంగా రిజిస్ట్రేషన్‌ చేయాలి. పెళ్లి విదేశంలో జరిగితే అక్కడి సంబంధిత అధికా రుల సమక్షంలో రిజిస్ట్రేషన్‌ చేయించాలి. 

►ఎన్‌ఆర్‌ఐల పాస్‌పోర్టుల జప్తు, రద్దుకు అనువుగా పాస్‌పోర్ట్‌ చట్టాన్నీ సవరించనుంది. 

►పెళ్లి చేసుకున్నాక చాలా మంది ఎన్‌ఆర్‌ఐ యువకులు తమ భార్యలను విదేశాల్లో వదిలేసి, భార్యలను శారీరకంగా, మానసికంగా క్షోభపెడుతున్నారని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. 

►కోర్టుల ఆదేశాల మేరకు నిందితులైన ఎన్‌ఆర్‌ఐ భర్తల పాస్‌పోర్టుతోపాటు, ట్రావెల్‌ డాక్యుమెంట్లను జప్తుచేయవచ్చు. 

►2015–17 మధ్యకాలంలో విదేశాల్లో 3,328 మంది మహిళలను వారి భర్తలు నిర్దాక్షిణ్యంగా వదిలేసి చేతులు దులుపుకున్నారని అధికారిక గణాంకాల్లో వెల్లడైంది. 

►బిల్లు ఇప్పటికే రాజ్యసభలో ప్రవేశపెట్టారుకనుక 16వ లోక్‌సభ జూన్‌ 3న రద్దయ్యేలోపు కొత్త ప్రభుత్వం ఏర్పడి ఈ బిల్లు లోక్‌సభకు వెళ్తే బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారే అవకాశముంది  

మరిన్ని వార్తలు