నిరసనల మధ్యే బిల్లులు ఆమోదం

16 Mar, 2018 02:06 IST|Sakshi

లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపులు, ప్రత్యేక పరిహార సవరణ బిల్లులు

ఎలాంటి చర్చా లేకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం

వరుసగా 9వ రోజు ఉభయసభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు

న్యూఢిల్లీ: వరుసగా తొమ్మిదో రోజు కూడా ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగడంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే పార్లమెంటు ఉభయసభలు శుక్రవారానికి వాయిదాపడ్డాయి. అయితే విపక్షాల నిరసనల మధ్యే లోక్‌సభలో ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో రెండు బిల్లుల్ని ఆమోదించారు. ఇక రాజ్యసభలో ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లుల్ని చర్చకు చేపట్టాలని ప్రయత్నించినా.. ప్రతిపక్షాల గందరగోళంతో సభ ముందుకు సాగలేదు.

బ్యాంకింగ్‌ కుంభకోణంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు కాంగ్రెస్, తృణమూల్‌ సహా ఇతర పార్టీలు పట్టుబట్టగా, ఏపీ ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌ కాంగ్రెస్, టీడీపీలు ఆందోళన కొనసాగించాయి. రిజర్వేషన్ల కోటా పెంచాలంటూ టీఆర్‌ఎస్, కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డు ఏర్పాటు కోసం అన్నాడీఎంకేలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపాయి. నిరసనల మధ్యే లోక్‌సభలో గ్రాట్యుటీ చెల్లింపుల(సవరణ) బిల్లు, ప్రత్యేక పరిహార(సవరణ) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పార్టీల నిరసనల హోరు మధ్య చర్చ జరిగే అవకాశం లేనందున మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రకటించారు.

అంతకుముందు ఉదయం గ్రాట్యుటీ చెల్లింపుల బిల్లును కార్మిక శాఖ మంత్రి సంతోశ్‌ గంగ్వార్‌ ప్రవేశపెడుతూ.. ఈ బిల్లు ముఖ్యంగా మహిళలతో పాటు ఉద్యోగులందరికీ చాలా ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రసూతీ సెలవుల్ని కూడా ఉద్యోగి సర్వీసు కాలంలో భాగంగానే ఈ బిల్లు పరిగణిస్తుంది. గ్రాట్యుటీ అవసరమైనప్పుడల్లా చట్ట సవరణ చేయాల్సిన అవసరం లేకుండా కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ బిల్లును రూపొందించారు.

ఈ బిల్లు అమల్లోకి వస్తే 5 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం ఒక సంస్థలో పనిచేసి రిటైరయ్యే లేదా వైదొలిగే వారు పొందే గ్రాట్యుటీపై రూ.20లక్షల వరకు పన్ను ఉండదు. ప్రస్తుతం రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంది. ఇక ప్రత్యేక పరిహారం(సవరణ) బిల్లు ప్రకారం... అవతలి వ్యక్తి వ్యాపార ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, నష్ట పరిహారాన్ని కోరే హక్కు కక్షిదారుకు ఉంటుంది. కాగా, విపక్షాల నిరసనలు పెరగడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అనంతరం సమావేశమైనా అదే పరిస్థితి ఉండడంతో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.   

మూడుసార్లు వాయిదా
ఇక రాజ్యసభ ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే ప్రతిపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు, అనంతరం మరో గంటపాటు వాయిదాపడింది. మధ్యాహ్నం 3 గంటలకు సభ భేటీ కాగానే డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ మాట్లాడుతూ.. ఆర్థిక బిల్లు, వినిమయ బిల్లు ఆమోదానికి సహకరించాలని ప్రతిపక్షాల్ని కోరారు. విపక్షాలు ఆందోళన కొనసాగించడంతో సభను మర్నాటికి వాయిదా వేశారు. ఆర్థిక బిల్లుపై చర్చ జరగకపోవడానికి ఆందోళన చేస్తున్న సభ్యులదే బాధ్యతని పేర్కొన్నారు. సభ వాయిదాకు ముందు శనగలపై కస్టమ్స్‌ పన్ను పెంపు నోటిఫికేషన్‌ ఆమోదం కోసం మంత్రి జైట్లీ తీర్మానం ప్రవేశపెట్టారు.

మరిన్ని వార్తలు