ప్రతీ రెండు రోజులకు ఇదే పరిస్థితి: ఎస్‌బీఐ వినియోగదారుల ఫిర్యాదులు

16 Oct, 2023 16:02 IST|Sakshi

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా యూపీఐ సేవల అంతరాయం ఖాతాదారుల్లో అసహనానికి దారి తీసింది. ఎస్‌బీఐ యూపీఐ పేమెంట్స్ ఫెయిల్‌ కావడం, లేదంటే ఇన్‌ సఫీషియంట్‌ బ్యాలెన్స్‌ అన్న మెసేజ్‌ రావడంతో పాటు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంలో ఇబ్బందులతో కస్టమర్లు గందరగోళంలో పడి పోయారు. గత రెండు, మూడు రోజులుగా ఈ ఇబ్బందులు ఎదురు కావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు.  దీంతో సోమవారం సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్‌లో నిలిచింది.  ప్రతీ రెండు రోజులు ఇదే పరిస్థితి అంటూ కొంతమంది యూజర్లు  ట్విటర్‌లో వ్యాఖ్యానించడం గమనార్హం.

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి డిజిటల్‌ లావాదేవీలు చాలాసార్లు ఫెయిల్‌ కావడంతో  కస్టమర్లలో ఆందోళన తలెత్తింది. ఈ సమస్య గత రెండు రోజుల నుండి జరుగుతోంది, ఎవరు పట్టించుకోవడంలేదు. ఖాతాదారుల ఇబ్బందులను బ్యాంకు వాళ్లు ఎంజాయ్‌ చేస్తున్నారా?  అసలు ఈ సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారంటూ ఒకరు ప్రశ్నించారు.  టెక్నికల్‌ అప్‌డేట్‌ కోసం మూడురోజులా అంటూ మరొక యూజర్‌  ఎస్‌బీఐపై  ధ్వజమెత్తారు.

అయితే తమ కస్టమర్ల యూనిఫైడ్స్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల్లో ఇబ్బందులు  రావచ్చని బ్యాంకు ముందుగానే ఎక్స్‌ ద్వారా  ఒక ప్రకటన జారీ చేసింది. టెక్నాలజీని అప్‌డేట్‌ చేస్తున్నట్టు ఈ నెల 14న వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నామని, త్వరలోనే అప్‌డేట్‌ అందిస్తామని ట్వీట్‌ చేసింది. అయితే,ఇప్పటివరకు కొత్త అప్‌డేట్‌ ఏమీలేదు.. ఇంకా ఎన్ని రోజులు ఈ పరిస్థితి  అన్న అసహనం వినియోగదారుల్లో నెలకొంది. 

మరిన్ని వార్తలు