'బీజేపీ ఎమ్మెల్యేలను ఎత్తుకొచ్చి బయటపడేశారు'

24 Jun, 2015 17:46 IST|Sakshi
'బీజేపీ ఎమ్మెల్యేలను ఎత్తుకొచ్చి బయటపడేశారు'

న్యూఢిల్లీ: రెండో రోజు ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. బీజేపీ నేతలు పలు అంశాలను లేవనెత్తుతూ గందరగోళం సృష్టించారు. సభలో ఉన్నది ముగ్గురు బీజేపీ నేతలే అయినా.. అధికార పార్టీకి మాత్రం చుక్కలు చూపించారు. దీంతో ఇక చేసేదేం లేక మార్షల్స్ రంగంలోకి దిగారు. ఎంత వారించినా వినకుండా.. అదేపనిగా అరుస్తూ సభలో గందరగోళం సృష్టిస్తున్న బీజేపీ నేత విజేందర్ గుప్తాను, మరో ఇద్దరు ఎమ్మెల్యేలను చివరకు మార్షల్స్ ఎత్తుకొచ్చి బయటేశారు. తొలుత మర్యాదగా రావాల్సిందిగా ఆయనను బ్రతిమిలాడినా వినకపోవడంతో మార్షల్స్ అంతా కలిసి ఆయనను గాల్లోకి లేపి ఎత్తుకొచ్చి బయట దించేశారు.

అంతకుముందు 'ఆయన అరిచి అరిచి స్వరం బొంగురు పోతున్నట్లుంది ఓ విక్స్ ఇవ్వండి' అంటూ స్పీకర్ చలోక్తులు విసిరారు. ఈ సమయంలో సభలోని సభ్యులంతా పెద్దగా నవ్వుతూ తమ ఎదురుగా ఉన్న బల్లలు చరిచారు. మంగళవారంనాటి తొలి రోజు సమావేశాల్లో నకిలీ డిగ్రీని కలిగి ఉండి జైలు పాలైన జితేందర్ సింగ్ తోమర్ విషయంపై విజేందర్ ప్రశ్నించగా.. రెండు రోజు సమావేశాల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించే అంశంపై చర్చ జరగాలని పట్టుబట్టారు. మిగితా ఏ సభా వ్యవహారాలు జరగకుండా అడ్డుకున్నారు. తమ డిమాండ్పై చర్చ జరిగే వరకు ఏం అంశంపై సభలో చర్చ అక్కర్లేదంటూ గందరగోళం సృష్టించారు. దీంతో వారిని మార్షల్స్ ద్వారా బయటకు పంపించాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు