ముండేకు కన్నీటి వీడ్కోలు

5 Jun, 2014 01:15 IST|Sakshi
ముండేకు కన్నీటి వీడ్కోలు

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు
తండ్రి చితికి నిప్పంటించిన పెద్ద కుమార్తె పంకజ
పోటెత్తిన అభిమానులు; అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి

 
 పర్లీ: రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండేకు వేలాది మంది ప్రజలు, కుటుంబ సభ్యులు బుధవారం కన్నీటి వీడ్కోలు పలికారు. ‘‘గోపీనాథ్ ముండే అమర్ రహే, ముండే సాబ్ పరత్ యా..(తిరిగి రండి)’’ నినాదాల మధ్య మహారాష్ట్రలోని ఆయన స్వస్థలం పర్లీలో మధ్యాహ్నం 2 గంటలకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. హిందూ సంప్రదాయానికి భిన్నంగా ఆయన పెద్ద కుమార్తె, పర్లీ ఎమ్మెల్యే పంకజ...తండ్రి చితికి నిప్పంటించారు. అంతకుముందు తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు వేలాది మంది అభిమానులు, మద్దతుదారులు ముండే అంత్యక్రియలకు వేదికైన బైద్యనాథ్ చక్కెర ఫ్యాక్టరీ కాంపౌండ్ వద్దకు పోటెత్తారు. ఎండ తీవ్రంగా ఉండటం, ముండే పార్థివదేహాన్ని దగ్గరి నుంచి చూసేందుకు వీలుకాకపోవడంతో వారిలో కొందరు అసహనానికి లోనై అక్కడ భారీగా మోహరించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు లాఠీచార్జి జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు.

ఈ సమయంలో ముండే పార్థివదేహం పక్కన నిలబడిన ఆయన కుమార్తె పంకజ వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మద్దతుదారులంతా సంయమనం పాటించాలని అక్కడున్న మైకులో పలుమార్లు విజ్ఞప్తి చేశారు. దీంతో కాసేపు శాంతించిన పలువురు మద్దతుదారులు అంత్యక్రియల అనంతరం మళ్లీ చెలరేగిపోయారు. ముండే మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓ కారుకు నిప్పుపెట్టడంతోపాటు సీఎం పృథ్వీరాజ్ చవాన్, ఇతర మంత్రుల కార్లను అడ్డగించారు. చవాన్ కారును చుట్టుముట్టి బానెట్‌ను బాదారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. కాగా, ముండే మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపిం చాలన్న బీజేపీ కార్యకర్తల డిమాండ్‌కు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు పలికారు. ముండే సీటు బెల్ట్ పెట్టుకొని ఉంటే బతికి ఉండేవారని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. కారు వెనక సీట్లో కూర్చుంటే సీటు బెల్టు పెట్టుకోనక్కర్లేదన్న అపోహ వల్లే తన స్నేహితుడైన ముండే ప్రాణాలు కోల్పోయారన్నారు.

 గడ్కారీకి అదనపు బాధ్యతలు: ముండే మరణంతో ఆయన చేపట్టిన మంత్రిత్వశాఖలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, షిప్పింగ్‌శాఖ మంత్రి నితిన్ గడ్కారీకి అదనపు బాధ్యతలుగా అప్పగించారు. ముండే చేపట్టిన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, తాగునీరు, పారిశుద్ధ్యం మంత్రిత్వ శాఖలను గడ్కారీకి అప్పగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు.
 

మరిన్ని వార్తలు