హంగ్‌ ఏర్పడితే..

8 May, 2019 02:34 IST|Sakshi

మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ ముందస్తు సమాలోచనలు

తటస్థ పార్టీలపై కన్నేసిన కమలనాథులు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు పూర్తికాకముందే ప్రభుత్వ ఏర్పాటు విషయమై రాజకీయ పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశాయా? కేంద్రంలో ఏ కూటమికి పూర్తిస్థాయి మెజారిటీ రానిపక్షంలో తటస్థ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబు చెబుతున్నారు. మిత్రపక్షాలతో కాంగ్రెస్‌ భేటీ లోక్‌సభకు మరో రెండువిడతల పోలింగ్‌ మిగిలిఉండగానే కాంగ్రెస్, వామపక్షాలు అనధికారంగా సంప్రదింపులు ప్రారంభించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, నేత డి.రాజా సోమవారం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, సోనియాగాంధీ సన్నిహితుడు అహ్మద్‌ పటేల్‌తో సమాలోచనలు జరిపినట్లు వెల్లడించాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష పార్టీలన్నీ మే 21 లేదా 22న ఢిల్లీలో సమావేశమయ్యే అవకాశముందని తెలుస్తోంది.

ఈ భేటీలోనే కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)పై పార్టీలన్నీ చర్చించవచ్చని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ను రాజకీయ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ప్రతిపక్షాలను అయోమయంలోకి నెట్టేసి మోదీకి లబ్ధి చేకూర్చేందుకే కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిపై కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఈ నెల 10న(శుక్రవారం) సమావేశమై చర్చిస్తుందని పేర్కొన్నారు. నవీన్‌ పట్నాయక్‌పై మోదీ ప్రశంసలు కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలకు చెక్‌ పెట్టేందుకు కమలనాథులు తటస్థులుగా ఉన్న నేతల మద్దతుపై ఆశలు పెట్టుకున్నారు.

ఒకవేళ ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించలేకపోతే ఈ తటస్థ పార్టీల మద్దతుతోనైనా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్న కృతనిశ్చయంతో బీజేపీ నేతలు ఉన్నారు. ఒడిశాను ఫొని తుపాను అతలాకుతలం చేసిన నేపథ్యంలో ఒడిశాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేశాయి’ అని ప్రశంసించారు. మే 23 తర్వాత కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ తక్కువైతే బీజేడీ లాంటి తటస్థ పార్టీల మద్దతు పొందాలన్న వ్యూహంతోనే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

కోవింద్‌వైపే అందరి దృష్టి ఒకవేళ కేంద్రంలో హంగ్‌ ఏర్పడితే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాత్ర కూడా కీలకంగా మారనుంది. ఎందుకంటే 1996లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలవడంతో అప్పటి రాష్ట్రపతి శంకర్‌దయాళ్‌ శర్మ ప్రధాని పదవి చేపట్టాల్సిందిగా వాజ్‌పేయిని ఆహ్వానించారు. కానీ 1998లో అప్పటి రాష్ట్రపతి నారాయణన్‌ వాజ్‌పేయిని ఆహ్వానించడంతో పాటు 272 మంది ఎంపీల మద్దతు ఉన్నట్లు లేఖలు సమర్పించాలని సూచించారు. 2004 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్రపతిæకలాం ఇదే సంప్రదాయాన్ని పాటించారు. ఈ నేపథ్యంలో 17వ లోక్‌సభ ఎన్నికల్లో ఒకవేళ హంగ్‌ ఏర్పడితే కోవింద్‌ ఏ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారన్న విషయమై అన్నివర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో తటస్థులు, ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశముందని అంచనా.

మరిన్ని వార్తలు