పెట్రోల్‌పై జీఎస్టీ+వ్యాట్‌..!!

20 Jun, 2018 15:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రోజురోజుకూ పెరుగుతూ పోతూ సామాన్యుడికి చుక్కలు చూపెడుతున్న పెట్రోల్‌, డిజీల్‌ ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందున్న ఒకే ఒక్క మార్గం వాటిని వస్తు సేవల పన్ను(జీఎస్టీ)లోకి తీసుకురావడం. అయితే, పెట్రోల్‌, డీజిల్‌, సహజ వాయువు, జెట్‌ ఇంధనం, క్రూడ్‌ ఆయిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ఆదాయాన్ని కోల్పోతాయి.

జీఎస్టీలో అత్యధిక పన్ను శ్లాబ్‌ 28 శాతం. దీనిలోకి పెట్రో సంబంధిత ఉత్పత్తులను తెచ్చినా ప్రభుత్వాలకు దాదాపు 20 వేల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. దీంతో ఇందుకు మరో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా జీఎస్టీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాట్‌ విధించే అవకాశం ఇవ్వడం ఒకటని సీనియర్‌ ప్రభుత్వ అధికారి వెల్లడించారు.

త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా పెట్రో ఉత్పత్తులపై కేవలం జీఎస్టీని మాత్రమే విధించడం లేదని తెలిపారు. అందుకే జీఎస్టీతో పాటు వ్యాట్‌ను పెట్రో ఉత్తత్పులపై విధించాలని భావిస్తున్నట్లు వివరించారు.

కేంద్రం ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్‌ డ్యూటీని విధిస్తోంది. వీటికి ఆయా రాష్ట్రాలు అదనంగా వ్యాట్‌ను విధిస్తున్నాయి. అత్యధికంగా ముంబైలో 39.12 శాతం వ్యాట్‌ను వసూలు చేస్తుండగా.. అండమాన్‌లో అత్యల్పంగా 6 శాతం వ్యాట్ విధిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు