దళితుల చట్టానికి కోరలు

2 Aug, 2018 03:31 IST|Sakshi
కేబినెట్‌ వివరాలను వెల్లడిస్తున్న కేంద్రమంత్రులు గోయల్, రవిశంకర్‌

పాత నిబంధనలు పునరుద్ధరించే బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌కు?

నిందితులకు బెయిల్‌ దక్కదు, అరెస్ట్‌కు అనుమతులక్కర్లేదు

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పాత నిబంధనలను పునరుద్ధరించడానికి ఉద్దేశించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన మంత్రి మండలి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 9న భారత్‌ బంద్‌ పాటించాలని దళిత సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. తాజా బిల్లులోని ముఖ్యాంశాలు..ఎస్సీ, ఎస్టీలపై దాడులు, దాష్టీకాలకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి ముందస్తు బెయిల్‌ ఇచ్చే నిబంధన తొలగింపు.

కేసు నమోదుకు ప్రాథమిక విచారణ అక్కర్లేదు. నిందితుల అరెస్ట్‌కు ఎలాంటి అనుమతులు తీసుకోనవసరంలేదు. నిందితులకు పలు రక్షణలు కల్పిస్తూ సుప్రీంకోర్టు మార్చి 20న చట్టంలో మార్పులు చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దుచేస్తూ పాత నిబంధనలను పునరుద్ధరించాలని దళితులు కోరుతున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుతో చట్టం బలహీనమైందని వారు ఆరోపిస్తున్నారు. ఎన్‌డీఏ కూటమిలోని కొన్ని మిత్ర పక్షాలు కూడా ప్రభుత్వ ఉదాసీన వైఖరిని వ్యతిరేకించాయి.

ఈ ఏడాది చివరన జరిగే మూడు రాష్ట్రాల ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం పాత నిబంధనలను పునరుద్ధరించింది. కేబినెట్‌ నిర్ణయంపై కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. బంద్‌ పాటించాలనుకున్న ఆగస్టు 9న వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని ప్రధాని మోదీ చెప్పినట్లు పాశ్వాన్‌ వెల్లడించారు. ప్రభుత్వం దళితులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకు తాజా బిల్లు చెంపపెట్టు అని అన్నారు.  

కుష్టు ఉందని విడాకులు ఇవ్వలేరు..
కుష్టు వ్యాధి సోకిందని భాగస్వామికి విడాకులు ఇవ్వడం ఇకపై కుదరదు. ఇందుకు సంబంధించిన బిల్లుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదముద్ర వేసింది. కుష్టు నయంకాని వ్యాధి అని భావిస్తున్న సమయంలో తీసుకొచ్చిన చట్టంలో ఆ వ్యాధితో బాధపడుతున్న జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వొచ్చని ఉందని కేంద్ర న్యాయశాఖకు చెందిన సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘అధునాతన చికిత్సతో ఇప్పుడు కుష్టును పూర్తిగా నివారించడం సాధ్యమే. అందువల్ల విడాకులకు కుష్టును ఒక కారణంగా చూపుతున్న సదరు చట్టంలోని నిబంధనను కొనసాగించడం సమర్థనీయం కాదు’ అని న్యాయశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు