ఆగస్టు 24 లేదా 26న ముహూర్తం!

22 Aug, 2017 11:01 IST|Sakshi
ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ!


► అన్నాడీఎంకేకు 2, జేడీయూకు ఒక కేబినెట్‌ పదవి
►  టీడీపీ నుంచి సీఎం రమేష్,  బీజేపీ నుంచి హరిబాబుకు అవకాశం!

ఆగస్టు 24 లేదా 26న ముహూర్తం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈ వారంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిపేందుకు కసరత్తు కొనసాగుతోంది. జేడీయూ, అన్నాడీఎంకే పార్టీల్లో వివాదాలు కొలిక్కిరావడంతో ఆగస్టు 24 లేదా 26న విస్తరణ ఉండవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. జేడీయూ ఇప్పటికే ఎన్డీఏలో చేరగా అన్నాడీఎంకే త్వరలో చేరనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలకూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో స్థానం కల్పించనున్నారని సమాచారం. అందుకోసమే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తమిళనాడు పర్యటన రద్దు చేసుకుని ప్రధానితో కలసి మంత్రివర్గ కూర్పుపై తుదిమెరుగులు దిద్దుతున్నారు.

విశ్వసనీయ సమాచారం మేరకు అన్నాడీఎంకేకు రెండు కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు, జేడీయూకు ఒక కేబినెట్, సహాయమం త్రి పదవి దక్కవచ్చు. 2019లోక్‌సభ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఈ విస్తరణ జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఆశించిన పనితీరు కనపర్చని వారిని మంత్రివర్గం నుంచి తప్పించనున్నట్లు సమాచారం. వయసు పైబడ్డ కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించి బిహార్‌ గవర్నర్‌గా పంపే అవకాశముంది. ఉత్తరప్రదేశ్, బిహార్‌కు ప్రాధా న్యత తగ్గించి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చు.  

తంబిదురైకి పట్టణాభివృద్ధి శాఖ?: లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురైకి పట్టణాభివృద్ధి శాఖ, ఆయన స్థానంలో శివసేన ఎంపీ ఆనందరావ్‌ అడుసుకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వనున్నట్లు సమాచారం. శివసేన నుంచి అనిల్‌ దేశాయ్, టీడీపీ నుంచి సీఎం రమేష్‌కి మంత్రిపదవి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఏపీ బీజేపీ కోటాలో వెంకయ్యనాయుడి స్థానంలో హరిబాబుకు సహాయమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి.

కర్ణాటక నుంచి బీజేపీ ఎంపీ అనిల్‌ హెగ్డేకి చోటు కల్పిస్తారని సమాచారం. ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో రక్షణ, అటవీ, పర్యావరణ శాఖ, పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖలకు పూర్తిస్థాయి మంత్రులు లేరు. కొందరు మంత్రుల వద్ద అదనపు శాఖలు ఉన్నాయి. కేబినెట్‌లో కొత్తగా చేరేవారికి వీటిని కేటాయించనున్నారు. 

మరిన్ని వార్తలు