Rajasthan Elections 2023: ఎడారి రాష్ట్రంలో ఓటింగ్‌ సునామీ!

25 Nov, 2023 22:21 IST|Sakshi

జైపూర్‌: ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో ఈసారి ఓటింగ్ శాతం మునుపటి ఓటింగ్ శాతాన్ని మించిపోనుంది. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 68 శాతానికిపైగా ఓటింగ్‌ నమోదైంది. జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 81.12 శాతం, పాలి జిల్లాలోని మార్వార్ జంక్షన్‌లో అత్యల్పంగా 57.36 శాతం పోలింగ్‌ నమోదైంది.

2018లో 74.06 శాతం
రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ సారి ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైన నేపథ్యంలో సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలింగ్ స్టేషన్ వెలుపల ఓటర్లు పొడవాటి క్యూలలో నిల్చోవడం చూస్తుంటే, ఓటింగ్ శాతం 75 శాతానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 

స్లో ఓటింగ్‌పై బీజేపీ ఫిర్యాదు
ఓటింగ్ శాతం బాగా నమోదవుతుందని భావిస్తున్నప్పటికీ, ప్రతిపక్ష బీజేపీ మాత్రం స్లో ఓటింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. స్లో ఓటింగ్ కోసం అధికార యంత్రాంగంపై సీఎం అశోక్ గెహ్లాట్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్‌పర్సన్ నారాయణ్ పంచారియా ఎలక్షన్‌ కమిషన్‌కు  ఫిర్యాదు చేశారు. దీనిపై రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా మాట్లాడుతూ, పోలింగ్ ముగిసే సమయంలోపు పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించిన ఓటర్లందరినీ ఓటు వేసేందుకు అనుమతించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

5.25 కోట్ల మంది ఓటర్లు
రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా గాను 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్ వాయిదా పడింది. 199 నియోజకవర్గాల్లో 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరు 1,862 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తమ ఓటు ద్వారా నిర్ణయించారు.

నువ్వా.. నేనా..
రాజస్థాన్‌లో జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా.. నేనా అన్నట్లు ప్రత్యక్ష పోటీ నెలకొంది. వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్వుళ్లూరుతుండగా.. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయానికి చెక్‌ చెప్పి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. కాగా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ బీజీపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పట్లో కాంగ్రెస్ 100, బీజేపీ 73 సీట్లు గెలుచుకున్నాయి.

మరిన్ని వార్తలు