అమ్మను కోల్పోయినా బాధ్యత మరచిపోలేదు

10 May, 2019 09:14 IST|Sakshi

విషాదంలోనూ ఓటేసిన 19 మంది కుటుంబ సభ్యులు

మధ్య ప్రదేశ్‌లోని సత్నా... ఐదో దశలో అక్కడ పోలింగు జరిగింది. అందరిలాగే  సత్నా మాజీ కార్పొరేటర్‌ అశోక్‌ గుప్తా కుటుంబీకులు కూడా  ఓటు  వేసేందుకు పోలింగు కేంద్రానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు.అయితే, అంతలోనే అనుకోని విషాదం... కార్పొరేటర్‌ తల్లి అకస్మాత్తుగా కన్ను మూసింది. కుటుంబ సభ్యులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు.ఒకవైపు తల్లి అంత్యక్రియలు నిర్వహించాలి. మరోవైపు ఓటు వేసి రావాలి. అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చాక ఓటు వేయడానికి సమయం ఉంటుందో...ఉండదో... అశోక్‌ గుప్తా కుటుంబ  సభ్యులంతా దీనిపై చాలా సేపు మల్లగుల్లాలు పడ్డారు.

చివరికి ముందు ఓటు వేసి వచ్చి ఆ తర్వాత అంతిమ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఒకవైపు ఆ ఏర్పాట్లు చూస్తోంటే ఓటు అర్హత కలిగిన 19 మంది పొద్దున్నే వెళ్లి ఓటు వేసి వచ్చారు. మృతురాలి భర్త కూడా కొడుకు సాయంతో పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేసి వచ్చారు.‘ఎన్నికలు ఐదేళ్లకొకసారి వస్తాయి. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత కాబట్టి ముందు ఓటు వేసి రావాలని నిర్ణయించుకున్నాం’అన్నారు మృతురాలి మనవడు కైలాష్‌ గుప్తా. ఓటు వేసి వచ్చాక అందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు