అఆల నుంచి ఱ వరకు... ప్రతి దశలోనూ ప్రక్షాళన

3 Jun, 2019 07:48 IST|Sakshi

కొత్త విద్యా విధానం కోసం కేంద్ర ప్రభుత్వం కసరత్తు

జాతీయ ముసాయిదా విద్యా విధానం–2019లో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌ :విద్యారంగంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. విద్యా సంస్థల్లో నాణ్యమైన బోధన, పరిశోధన, ఉపాధి అవకాశాలు లక్ష్యంగా కేంద్రం నూతన విద్యా విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టింది. ఇస్రో మాజీ చీఫ్‌ కస్తూరి రంగన్‌ చైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ... కేంద్ర మానవ వనరుల మంత్రి రమేష్‌ పొఖ్రియాల్‌కు ఇటీవలే జాతీయ ముసాయిదా విద్యా విధానం–2019 నివేదికను సమర్పించింది. అందులో భారీ సంస్కరణలను సిఫారసు చేసింది. ప్రీ ప్రైమరీ మొదలుకొని ఉన్నతవిద్య వరకు అన్ని స్థాయిల్లో నాణ్యతా ప్రమాణాలకు పెద్దపీట వేసేలా మార్పులను సూచించింది. విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడంతోపాటు వారిలో నైపుణ్యాలను పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. ముఖ్యంగా నిరుపేద కుటుంబాలకు కూడా అసమానతలు లేని, నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో నూతన విద్యా విధానాన్ని సిఫారసు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అందుబాటులోకి విద్య, సమానత్వం, నాణ్యత, జవాబుదారీతనం అనే నాలుగు అంశాలు లక్ష్యంగా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ
(ఎంహెచ్‌ఆర్‌డీ) మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌గా మార్చాలని పేర్కొంది.

నూతన విద్యావిధానంలో తీసుకురానున్న ప్రధాన మార్పులివీ...
పాఠశాల విద్యలో...

పాఠ్య ప్రణాళిక, బోధన రూపాలను మార్చాలి.
ఎర్లీ చైల్డ్‌ కేర్‌ ఎడ్యుకేషన్‌ను పాఠశాల విద్యలో భాగం చేయాలి.
విద్యాహక్కు చట్టం పరిధిని 3 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు విస్తరించాలి. తద్వారా ప్రీ ప్రైమరీని ప్రాథమిక విద్యలో భాగం చేయడంతోపాటు ఇంటర్మీడియెట్‌ను కూడా విద్యాహక్కు చట్టం పరిధిలోకి తీసుకురావాలి.
10+2గా ఉన్న పాఠశాల విద్యను 5+3+3+4గా మార్పు చేయాలి. ఇందులో మొదటి ఐదేళ్లు ఫౌండేషనల్‌ స్టేజ్‌గా, తరువాత మూడేళ్లు ప్రిపరేటరీ స్టేజ్‌గా, తరువాత మూడేళ్లు మిడిల్‌ స్టేజ్‌/అప్పర్‌ ప్రైమరీ స్టేజ్‌గా తరువాత నాలుగేళ్లు హైస్టేజ్‌/సెకండరీ స్టేజ్‌గా మార్పు.

5+3+3+4 విధానంలో..
మొదటి ఐదేళ్ల ఫౌండేషనల్‌ స్టేజీలో మూడేళ్లపాటు ప్రీ ప్రైమరీ, గ్రేడ్‌–1, గ్రేడ్‌–2  తరగతులు (ఒకటో, రెండో తరగతి) ఉంటాయి.
ప్రిపరేటరీ స్టేజ్‌లో 3, 4, 5 గ్రేడ్లు.
మిడిల్‌ స్టేజ్‌/అప్పర్‌ ప్రైమరీ స్టేజ్‌ పరిధిలోకి 6, 7, 8 గ్రేడ్లు. హై స్టేజ్‌/సెకండరీ స్టేజ్‌ పరిధిలోకి 9, 10, 11, 12 గ్రేడ్లు. తద్వారా విద్యా పాఠ్య ప్రణాళికలో విద్యార్థులపై చదువుల భారాన్ని తగ్గించవచ్చు.
ఫౌండేషన్‌ స్టేజ్‌ వయసు 3–8 ఏళ్లుగా, ప్రిపరేటరీ దశ వయసు    8–11 సంవత్సరాలుగా, మిడిల్‌ స్టేజ్‌ వయసు 11–14 సంవత్సరాలుగా, సెకండరీ స్టేజ్‌ వయసును 14–18 ఏళ్లుగా చేయాలి.
కరిక్యులర్, కో కరిక్యులర్‌ లేదా ఎక్స్‌ట్రా కరిక్యులర్‌ మధ్య తేడా ఉండదు. పాఠ్య ప్రణాళికలపరంగా, కళలు, సంగీతం, క్రీడలు, యోగా వంటి అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి.
2025 నాటికి 5వ తరగతి, ఆపై స్థాయిలో ఉండే 5 కోట్ల మందికిపైగా పిల్లల్లో ఫౌండేషన్‌ లిటరసీని పెంపొందించాలి.
ప్రీ ప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం అందించాలి.
టీచర్‌ ఎడ్యుకేషన్‌ను సమూలంగా మార్చడం, అతితక్కువ స్థాయిగల ఉపాధ్యాయ విద్యాసంస్థలను మూసేయడం, టీచర్‌ ప్రిపరేషన్‌/ ఎడ్యుకేషన్‌ను కాలేజీ/యూనివర్సిటీకి అనుసంధానించాలి.
నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను అమలు చేయాలి.
పాఠ్య ప్రణాళిక అభివృద్ధిలో స్కిల్స్, లైఫ్‌ సంబంధ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రపంచస్థాయి బోధనతోపాటు 21వ శతాబ్దపు నైపుణ్యాలను విద్యార్థులకు నేర్పించేలా మార్పులు చేయాలి.
ఉపాధ్యాయుల కనీస అర్హత డిగ్రీ ఉండాలి.
ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలను సమానంగా చూడాలి. అవి లాభాపేక్ష లేనివిగా మార్పు చేయాలి.

ఉన్నత విద్యలో..
ఉన్నత విద్యాసంస్థలను మూడు రకాలుగా మార్పు చేయాలి.
అంతర్జాతీయ స్థాయి పరిశోధన, నాణ్యతతో కూడిన బోధనపై దృష్టి కేంద్రీకరించాలి.
అన్ని కోర్సుల్లో పరిశోధనలకు అవసరమైన అంశాలను గుర్తించి అందుబాటులోకి తేవాలి.
అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నాణ్యమైన విద్యను అందించాలి.
ఈ లక్ష్యాలను సాధించేందుకు మిషన్‌ నలంద, మిషన్‌ తక్షశిల పేరిట రెండు ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయాలి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంబంధ అంశాల్లో పరస్పర సహకారం కోసం రాష్ట్రీయ శిక్షా ఆయోగ్‌ అనే కొత్త సంస్థను ఏర్పాటు చేయాలి.
విద్యా సంస్థల్లో పరిశోధనలకు పెద్దపీట వేయాలి. ఉన్నత విద్యలో అన్ని స్థాయిల్లో పరిశోధన స్థాయి పెంచడానికి మరో ప్రత్యేక సంస్థ ‘ది నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ను ఏర్పాటు చేయాలి.
పాళీ, పర్షియన్, ప్రాకృత భాషల అభివృద్ధికి చర్యలు చేపట్టడంతోపాటు వాటిని జాతీయ విద్యాలయాలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషన్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో అమలు చేయాలి.
సంస్కృతాన్ని ద్వితీయ భాషగా (ఆప్షనల్‌) అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అన్ని స్థాయిల్లో సుల భంగా పాఠ్య పుస్తకాల రూపకల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉన్నత విద్యలో అంతర్జాతీయీకరణను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. దూరవిద్య, సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉన్నత విద్యలో వివిధ రంగాలు, పారిశ్రామిక నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచాలి.

ప్రజాభిప్రాయ స్వీకరణకు జూన్‌ 30 తుది గడువు
బండెడు పాఠ్య ప్రణాళిక ఉండదు. ఆటపాటలు, విద్యేతర కార్యక్రమాలూ ఇక చదువులో భాగమే. ఆసక్తిని బట్టి సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. పరీక్షలు సులభంగా ఉంటాయి. రెండుసార్లు పరీక్షలు రాసేందుకు అవకాశం ఇస్తారు. మొత్తంమీద ఇక ఒత్తిడిలేని చదువును అందుబాటులోకి తీసుకురానున్నారు. జాతీయ నూతన విద్యావిధానం నివేదిక సారాంశం ఇదే. కస్తూరి రంగన్‌ కమిటీ నివేదికను వెబ్‌సైట్లో ఉంచిన కేంద్రం జూన్‌ 30లోగా ప్రజలు అభిప్రాయాలను పంపించాలని కోరింది. కేంద్ర మానవ వనరుల శాఖను విద్యామంత్రిత్వ శాఖగా పిలవాలని ప్రతిపాదించింది. విద్యా ప్రగతి పర్యవేక్షణకు ప్రధాని చైర్మన్‌గా జాతీయ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. పాఠశాల, ఉన్నత విద్యకు సంబంధించి పలు మార్పులు చేయాలని సూచించింది. వచ్చే కొద్ది రోజుల్లోనే నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదానికి పంపిస్తారు.

పాఠశాల విద్యలో ఇవీ మార్పులు...
8వ తరగతి వరకు మాతృభాషలో చదువుకోవాలి. కనీసం 5వ తరగతి వరకు తప్పనిసరి. 3–8 వయసు వరకు పిల్లలు వివిధ భాషలు సులువుగా నేర్చుకుంటారు. అందుకే వారికి మూడు భాషలను పరిచయం చేస్తారు. దానివల్ల వారు మాట్లాడటానికి వీలవుతుంది.
అవగాహన పెంచుకునేందుకు 9–12వ తరగతి విద్యార్థులందరికీ కరెంట్‌ అఫైర్స్‌ కూడా పాఠ్య ప్రణాళికలో ఉంటుంది.
ప్రతి విద్యార్థిలో శాస్త్రీయ దృకృథం పెంచేలా చదువు ఉంటుంది. నైతిక భావాలు, తార్కిక పరిశీలన, సాంఘిక, భావోద్వేగపరమైన అంశాలు, కమ్యూనికేషన్, నైతికత, డిజిటల్‌ విద్య, భారత్‌పై పరిజ్ఞానం, దేశంలోని ముఖ్యమైన సమస్యలను తెలుసుకునేలా సిలబస్‌ రూపొందిస్తారు.
పాఠశాల నుంచి ఉన్నతవిద్య వరకు సంస్కృతం ఒక ఐచ్ఛిక సబ్జెక్టుగా ఉంటుంది.
వివిధ సబ్జెక్టులపై ఒలింపియాడ్, ఇతర పోటీ పరీక్షలను మరింత ప్రోత్సహిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడ్లలో పాల్గొనేందుకు కేంద్రం నిధులిస్తుంది.
ప్రైవేటు పాఠశాలలు రుసుములను నిర్ణయించుకోవచ్చు. కానీ ఇష్టారాజ్యంగా రుసుములు పెంచరాదు.

ఉన్నత విద్యలో..
అనుబంధ కళాశాలలు ఉండవు. విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ ఇచ్చే స్వయం ప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలే ఉంటాయి. అంటే ఇక ప్రతి కళాశాల స్వయం ప్రతిపత్తి వైపు అడుగులేయాలి.
ఏఐసీటీఈ, పీసీఐ, ఎన్‌సీటీఈ తదితర నియంత్రణ సంస్థల స్థానంలో ఉన్నత, సాంకేతిక విద్యాసంస్థలకు కలిపి జాతీయ ఉన్నత విద్యా నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలి.
బ్యాచిలర్‌ ఆఫ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ లేదా బ్యాచిలర్‌ ఆఫ్‌ లిబరల్‌ ఎడ్యుకేషన్‌ పేరిట నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టాలి.

మరిన్ని వార్తలు