కేంద్ర ఉద్యోగాలకు ‘సెట్‌’ 

4 Dec, 2019 02:43 IST|Sakshi

గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ ఉద్యోగాలకు ఒకే పరీక్ష నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదన 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని గ్రూప్‌ బీ, గ్రూప్‌ సీ ఉద్యోగాల భర్తీకి ఒకే పరీక్ష ద్వారా చేపట్టాలని కేంద్రం ప్రతిపాదించింది. అందుకు ఒక ప్రత్యేక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష ద్వారా ఐఏఎస్‌ (ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీసెస్‌), ఐపీఎస్‌(ఇండియన్‌ పోలీస్‌ సర్వీసెస్‌), ఐఎఫ్‌ఎస్‌(ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసెస్‌), ఐఎఫ్‌ఓఎస్‌(ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌) ఉద్యోగాలతో పాటు గ్రూప్‌ ఏ, గ్రూప్‌ బీలోని కొన్ని గెజిటెడ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగాల భర్తీకి, ముఖ్యంగా కొన్ని గ్రూప్‌ బీ ఉద్యోగాల కోసం ఏటా పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ‘కేంద్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని గ్రూప్‌ బీ నాన్‌ గెజిటెడ్‌ పోస్ట్‌లు, కొన్ని గ్రూప్‌ బీ గెజిటెడ్‌ పోస్ట్స్, గ్రూప్‌ సీ పోస్ట్‌ల భర్తీకి ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసి, ఆ ఏజెన్సీ ద్వారా కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ పరీక్ష ‘కామన్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సెట్‌)’ను నిర్వహించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది’ అని కేంద్ర సిబ్బంది శాఖ అధికారులు వెల్లడించారు.

ఈ ప్రతిపాదనపై స్పందించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరామన్నారు. అలాగే, ఉద్యోగార్థులు ఈ ప్రతిపాదనపై స్పందించాలని కోరారు. సెట్‌ నిర్వహణతో ఉద్యోగార్థులకు, ప్రభుత్వ సంస్థలకు డబ్బు, సమయం ఆదా అవుతుందని కేంద్ర సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర చెప్పారు. ప్రధాని లక్ష్యమైన సులభతర పాలనలో భాగంగా ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చామన్నారు. ‘ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగం కోసం వేర్వేరు సంస్థలు ప్రకటించే వేర్వేరు ఉద్యోగాలకు అభ్యర్థులు వేరుగా దరఖాస్తు చేయాల్సి వస్తోంది. వేర్వేరు సమయాల్లో, వేర్వేరు ప్రాంతాల్లో జరిగే ఆ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడం నుంచి పరీక్షకు హాజరవడం వరకు అభ్యర్థి అనేక వ్యయ ప్రయాసలకు లోనవాల్సి వస్తోంది. అందువల్ల ఒకే ఏజెన్సీ నిర్వహించే ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థి వివిధ ఉద్యోగాలకు ఒకేసారి ప్రిపేర్‌ కావచ్చు’ అని అన్నారు. అధికారిక లెక్కల ప్రకారం కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 6,83,823 ఖాళీలున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా