ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు!

28 Feb, 2016 11:59 IST|Sakshi
ఆ సినిమాకు వ్యతిరేకంగా నిరసన సెగలు!

బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి తాజా చిత్రం 'అలీగఢ్‌' దేశమంతటా విడుదలైనా.. ఒక్క ప్రాంతంలో మాత్రం రిలీజ్‌కు నోచుకోలేదు. అది ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతం. యూపీలోని మిగతా జిల్లాల్లో విడుదలైనా.. అలీగఢ్‌లో మాత్రం ఈ సినిమాపై నిషేధం విధించారు. ఇందుకు కారణం ఈ సినిమా టైటిలే కాదు.. ఇందులోని నేపథ్యం కూడా.

డైరెక్టర్ హన్సల్‌ మొహతా వివాదాస్పద ప్రాజెక్టు అయిన ఈ సినిమా.. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ రామచంద్ర సిరాస్‌ జీవిత కథ  ఆధారంగా తెరకెక్కింది. స్వలింగ సంపర్కం కలిగి ఉన్నాడనే నెపంతో యూనివర్సిటీ అధికారులు ఆయనను ఏడేళ్ల కిందట సస్పెండ్ చేశారు. ఏఎంయూలోని తన నివాసంలో ఓ రిక్షా కార్మికుడితో ఆయన స్వలింగ సంపర్కం జరుపుతుండగా స్థానిక జర్నలిస్టులు అనుమానాస్పద స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు. దీంతో తప్పుడు ప్రవర్తన కింద వర్సిటీ ఆయనపై వేటు వేసింది.

తన సస్పెన్షన్‌పై కోర్టుకు వెళ్లి విజయం సాధించిన సిరాస్‌ ఆ తర్వాత వారం రోజులకే అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వెండితెరకు మీదకు తెచ్చిన ఈ సినిమాపై అలీగఢ్ వర్సిటీ విద్యార్థులు, కొన్ని సంఘాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీని తప్పుడురీతిలో ఈ సినిమాలో చిత్రీకరించారని, ఈ సినిమా టైటిల్ ను వెంటనే మార్చాలని ఏఎంయూ విద్యార్థులు, పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు