ముంబై డాన్‌కు కర్ణాటకలో పాస్‌పోర్టు!

9 Nov, 2015 08:51 IST|Sakshi
ముంబై డాన్‌కు కర్ణాటకలో పాస్‌పోర్టు!

మాఫియా డాన్ ఛోటా రాజన్‌కు మోహన్ కుమార్ అనే పేరుతో నకిలీ పాస్‌పోర్టు ఉండటం వల్లే అతడు పట్టుబడ్డాడు. అయితే ఆ పాస్‌పోర్టులో అతడి చిరునామా, పుట్టిన స్థలం మాత్రం ఎక్కడున్నాయో తెలుసా.. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో! ఇదెలా సాధ్యమయ్యిందో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు. ఇండోనేషియాలోని బాలిలో అరెస్టయిన ఛోటా రాజన్.. పి. మోహన్ కుమార్ అనే పేరుతో పాస్‌పోర్టు తీసుకున్నాడు. అందులో అతడి చిరునామా ఓల్డ్ ఎంసీ రోడ్, ఆజాద్ నగర్, మాండ్యా అని ఉంది. పాస్‌పోర్టు నంబరు జి9273860. ఇది 2008లో జారీ అయ్యింది. తాను మాండ్యాలోనే పుట్టినట్లు కూడా అందులో ఉంది. ఈ పాస్‌పోర్టు ఉపయోగించి ఎక్కువగా ఆస్ట్రేలియా, ఆఫ్రికాల మధ్య ఛోటా రాజన్ తిరిగాడు.

ఛోటారాజన్ నకిలీ పాస్‌పోర్టుతో తిరుగుతున్నట్లు అందరూ చెబుతున్నా, మాండ్యా పోలీసులు మాత్రం అబ్బే కాదంటున్నారు. నిజంగానే అక్కడ ఒక పాత ఎంసీ రోడ్డు, ఆజాద్ నగర్ ఉన్నాయి. దాంతో పోలీసులతో కుమ్మక్కు కావడం వల్లే ఈ పాస్‌పోర్టు సంపాదించగలిగాడా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మాండ్యా వెస్ట్ పోలీసు స్టేషన్ పరిధిలోకి రాజన్ ఇచ్చిన చిరునామా వస్తుంది. కానీ అక్కడ మోహన్ కుమార్ అనే పేరుతో ఎవరూ లేరని స్పష్టమైంది. ఈ ఆధారాలతో  రాజన్ మీద మొదటి కేసును డీల్ చేయాలని సీబీఐ వర్గాలు భావిస్తున్నాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు