ఉత్తరాఖండ్ బాధితులకు ‘చిరు’ పరామర్శ కరువు

29 Jun, 2013 01:56 IST|Sakshi
సుశీల్ కుమార్ షిండే తో చిరంజీవి
డెహ్రాడూన్ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి శ్యామ్: జలప్రళయంలో కాళరాత్రులు గడిపి చావుబతుకుల మధ్య బయటకు వచ్చిన రాష్ట్ర బాధితులను కలవకుండానే కేంద్రమంత్రి చిరంజీవి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెనక్కివెళ్లారు. వాతావరణం అనుకూలించకపోవడంతో వీరు బద్రీనాథ్ వెళ్లకుండానే వెనుదిరిగారు. బద్రీనాథ్ పరిసర ప్రాంతాల నుంచి హార్సిల్ బేస్ క్యాంపుగా బాధితులను వెనక్కి రప్పిస్తున్నారు. మన రాష్ట్రానికి చెందిన బాధితులను వాహనాల ద్వారా రిషికేష్‌లోని ఆంధ్ర ఆశ్రమానికి తరలించారు.
 
ఆంధ్ర ఆశ్రమానికి చిరంజీవి, బొత్సలు వస్తారని తెలియడంతో వారికి తమ గోడు చెప్పుకోవాలని రాష్ట్ర యాత్రికులు ఎదురుచూశారు. అయితే వారు అక్కడికి రాకపోవడంతో బాధితులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉత్తరాఖండ్‌కు చేరుకుని బాధితులను కలిసి ఓదారుస్తూ, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర పర్యాటక మంత్రికి బాధితులను పరామర్శించే సమయమే దొరకలేదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కొండ్రు మురళీ శుక్రవారం సాయంత్రం డెహ్రాడూన్ చేరుకున్నారు. 
 
50 మందికి పైగా బాధితులతో టీడీపీ విమానం
టీడీపీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చెందిన 50 మందికి పైగా బాధితులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు యాత్రికులు డెహ్రాడూన్ నుంచి బ యలు దేరారు. రిషికేష్‌కు 10 కి.మీ. దూరాన ఏర్పాటు చేసిన శిబిరం నుంచి బాధితులను టీడీపీ ఎంపీలు రమేష్ రాథోడ్, కె.నారాయణ, నిమ్మల కిష్టప్ప, ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్టు వైద్యులు దగ్గరుండి తరలించారు.
మరిన్ని వార్తలు