‘విరుద్ధ ప్రయోజనాల్లో’ దోవల్‌ కొడుకు!

5 Nov, 2017 04:00 IST|Sakshi

ఆయన కంపెనీలో డైరెక్టర్లుగా నలుగురు కేంద్ర మంత్రులు

కథనం ప్రచురించిన ‘ది వైర్‌’

కాంగ్రెస్‌ మండిపాటు

న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ కుమారుడు శౌర్యకు చెందిన ఓ సంస్థలో నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. శౌర్యకు చెందిన ఇండియా ఫౌండేషన్‌ సంస్థలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, సురేశ్‌ ప్రభు, జయంత్‌ సిన్హా, ఎంజే అక్బర్‌లు సభ్యులుగా ఉన్నారని, ఇది పరస్పర విరుద్ద ప్రయోజనాలను పొందడమేనని ‘ది వైర్‌’ వెబ్‌సైట్‌ కథనం రాసింది.

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ స్పందిస్తూ..‘ అమిత్‌–జయ్‌ షాల ఎపిసోడ్‌ ఘన విజయం సాధించిన అనంతరం బీజేపీ ఇప్పుడు అజిత్‌ దోవల్‌– శౌర్యాల కథను కొత్తగా ప్రారంభించింది’ అని ట్వీటర్‌లో ఎద్దేవా చేశారు. ఈ కథనం పూర్తిగా నిరాధారమని ఇండియా ఫౌండేషన్‌ స్పష్టంచేసింది. నలుగురు వ్యక్తులు మంత్రులు కాకముందే తమ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారంది. తమ సంస్థ విశ్వసనీయత, గౌరవం, వారసత్వంపై జరుగుతున్న దాడిని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా ఫౌండేషన్‌లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఉన్న శౌర్య జెమినీ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ అనే సంస్థను నిర్వహిస్తున్నారని ది వైర్‌ వెల్లడించింది. ఈ సంస్థ ఆర్గనైజేషన్‌ ఫర్‌ ఎకనమిక్‌ కోఆపరేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌(ఈసీఈడీ)సభ్యదేశాల నుంచి ఆసియా మార్కెట్లలోకి పెట్టుబడులు వచ్చేలా చూస్తుందని తెలిపింది. 

>
మరిన్ని వార్తలు