‘మౌర్య సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించారు’

26 Jan, 2017 21:28 IST|Sakshi
‘మౌర్య సుప్రీం ఆదేశాలు ఉల్లంఘించారు’

న్యూఢిల్లీ: రామమందిరం నిర్మాణం అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చిన ఉత్తరప్రదేశ్‌ బీజేపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యపై కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కోర్టు ఆదేశాలను సైతం దిక్కరించి ఓటర్లను ప్రభావితం చేసే చర్యలకు కేశవ్‌ దిగారని ఆ ఫిర్యాదులో ఆరోపించింది. గతంలో మతం పేరిట ఏ రాజకీయ పార్టీ కూడా ఓట్లు అడగరాదని, ఎన్నికల ప్రచారం చేయరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆ ఆదేశాలను భేఖాతరు చేస్తూ బీజేపీ నేత మతపరమైన అంశాన్ని లేవనెత్తారని పేర్కొంది.

ఈ సందర్భంగా లీగల్‌ అండ్‌ హ్యూమన్‌ రైట్స్‌  కాంగ్రెస్‌ కార్యదర్శి కె.సి మిట్టల్‌ ఎన్నికల కమిషన్‌ చీఫ్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీకి ఉన్న కమలం గుర్తును తొలగించాలని చెప్పారు. ఫిర్యాదు అనంతరం మిట్టల్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో కులం, మతాలను వాడుకోవడం పై ఎన్నికల కమిషన్, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని నాంది పలకాలని కోరారు. తాము అధికారంలోకి వచ్చాక రామమందిరం నిర్మిస్తామని అంతకుముందు బీజేపీ రాష్ట్ర చీఫ్‌ మౌర్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు