ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు

11 Feb, 2014 13:15 IST|Sakshi
ఆరుగురు సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు

న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ మరో వ్యూహానికి తెర తీసింది. సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సీమాంధ్ర ఎంపీలపై బహిష్కరణ వేటు వేసింది. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఆరుగురు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్లను పార్టీ నుంచి బహిష్కరించింది.

ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతోయూపీఏ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ సీమాంధ్ర ఎంపీలు ఆరుగురు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్సభ స్పీకర్కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.  దీన్నే సాకుగా చూపించి ఇప్పుడు ఎంపీలపై బహిష్కరణ వేటు వేసింది. ఒకవేళ లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి వస్తే, అప్పుడు వీళ్లు తమ ఎంపీలు కారని, వారిని పార్టీ నుంచి బహిష్కరించామని చెప్పుకోడానికి వీలుంటుందన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దల వ్యూహంలా కనిపిస్తోంది.

పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులను కాంగ్రెసు కట్టడి చేయలేకపోవడంపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. తాము బిల్లుకు మద్దతు ఇస్తామని అంటూనే వివిధ షరతులు పెడుతోంది. అయితే, సొంత పార్టీ వాళ్లనే కట్టడి చేయలేరా, అవసరమైతే వాళ్లను సస్పెండ్ చేయండి అంటూ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ సోమవారం నాడు వ్యాఖ్యానించారు. దీంతో కాంగ్రెసు పార్టీకి ఒక పరిష్కారం దొరికినట్లయింది. మొదట్లో సభ్యులపై చర్యలు తీసుకోవద్దన్న బీజేపీయే ఇప్పుడు మార్గం చూపించిందని సంతోషిస్తూ, ముందుగా పార్టీ నుంచి సస్పెన్షన్ కాకుండా ఏకంగా బహిష్కరించేసి చేతులు దులుపుకుంది. రేపో మాపో తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి వస్తే, అప్పుడు సీమాంధ్ర ఎంపీలు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఎటూ చేస్తారు కాబట్టి, అప్పుడు సభ నుంచి కూడా వారిని సస్పెండ్ చేయించొచ్చని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు