ఆర్బీఐ మాజీ గవర్నర్‌ కన్నుమూత: పలువురి సంతాపం

18 Nov, 2023 20:34 IST|Sakshi

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్ ఎస్.వెంకటరమణన్ (92) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో శనివారం ఉదయం చెన్నైలో  ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పలువురు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

అద్భుతమైన వ్యక్తిత్వం , ప్రజా సేవకుడు, సంక్షోభ సమయాల్లో అపారమైన సహకారాన్ని అందించిన వెంకటరమణన్ మరణం విచారకరం అంటూ  ఆర్బీఐ గవర్నర్‌  శక్తికాంత దాస్ సంతాపం వెలిబుచ్చారు. ఆత్మకు శాశ్వత శాంతి కలగాలంటూ ట్వీట్‌ చేశారు. ఆర్థిక రంగంలో తనదైన ముద్ర వేశారంటూ కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్ కూడా తన సంతాపాన్ని  తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధికి , ఇంధనానికి కూడా ప్రధాన కృషి చేసారనీ. 60వ దశకం మధ్యలో హరిత విప్లవానికి నాంది పలకడంలో కీలక పాత్ర పోషించిన సి.సుబ్రమణ్యంకు కీలక సహాయకుడిగా పనిచేశారన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమకు అనుబంధం ఉంది, చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి, చాలా నేర్చుకున్నాను అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. 

 కాగా  వెంకటరమణన్ 1931లో తమిళనాడులోని నాగర్ కోయిల్ లో జన్మించారు. తిరువనంతపురంలోని యూనివర్సిటీ కాలేజ్ నుండి భౌతికశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత 1953లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో చేరారు. 1968లో, అమెరికా  కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుంచి  మేనేజ్‌మెంట్‌లో మరొక మాస్టర్స్ డిగ్రీని చేశారు. 1990 - 1992 వరకు ఆర్బీఐ  18వ గవర్నర్‌గా పనిచేశారు.1985 నుండి 1989 వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక కార్యదర్శిగా పనిచేశారు. ఆర్బీఐ గవర్నర్ బాధ్యతలు చేపట్టక ముందు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగానూ వ్యవహరించారు. వెంకటరమణన్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు (గిరిజా వైద్యనాథన్, తమిళనాడు మాజీ ప్రధాన కార్యదర్శి , సుధా వైద్యనాథన్.) ఉన్నారు. 

మరిన్ని వార్తలు