కాంగ్రెస్‌కు ఆ అర్హత లేదు!

26 Jul, 2014 00:59 IST|Sakshi

అటార్నీ జనరల్ స్పష్టీకరణ
 
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష హోదా(ఎల్‌ఓపీ) సాధించేం దుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు. ఎల్‌ఓపీ ఇచ్చేందుకు అవసరమైన 10% సీట్ల(మొత్తం 543 స్థానాల్లో 55 సీట్లు)ను కాంగ్రెస్ సాధించలేదని, 10% సీట్లు సాధించకుండా ఏ పార్టీకి కూడా ఎల్‌ఓపీ ఇచ్చిన దృష్టాంతం గతంలో ఎన్నడూ లేదని లోక్‌సభ స్పీకర్‌కు ఆయన వివరించారని శుక్రవారం లోక్‌సభ వర్గాలు తెలిపాయి. 1984లో కాంగ్రెస్ 400 పైగా స్థానాలు సాధించిన సమయంలో విపక్ష పార్టీల్లో టీడీపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ఇదే కారణంతో ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి ఇవ్వలేదని రోహత్గీ స్పీకర్‌కు గుర్తు చేశారని చెప్పాయి. లోక్‌సభ ఎన్నికల్లో 44 స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఎల్‌ఓపీ పదవి కోసం పట్టుబడుతుండటంతో స్పీకర్ ఏజీ అభిప్రాయం కోరడంతో ఆయన స్పందించారు. యూపీఏ కూటమిని పరిగణనలోకి తీసుకుని ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు ఎల్‌ఓపీ హోదా ఇవ్వవచ్చన్న వాదననూ ఏజీ తోసిపుచ్చినట్లు సమాచారం. స్పష్టమైన చట్టం ఉంది: దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ..‘ప్రభుత్వ అభిప్రాయాలను ఏజీ ప్రతిబింబిస్తారు. స్పీకర్ నిర్ణయం తరువాతే ఈ విషయంపై స్పందిస్తాం’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు. ఎల్‌ఓపీకి సంబంధించి 1977లో స్పష్టమైన చట్టం రూపొందిందని, 2003లో సవరణ కూడా జరిగిందన్నారు.

సీపీపీ భేటీపై సోనియాకు సమాచార లోపం: కాంగ్రెస్ పార్టీలో సమాచార లోపం ఏ స్థాయిలో ఉందో తెలిపే సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశం ఉందన్న సమాచారంతో పార్లమెంటుకు చేరుకున్న అధ్యక్షురాలు సోనియా, తీరా అక్కడ పార్టీ ఎంపీలెవరూ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వాస్తవానికి ఏం జరిగిందంటే...సీపీపీ భేటీని శుక్రవారం జరపాలని తొలుత భావించినా పలు కారణాలరీత్యా దాన్ని వాయిదా వేశారు.
 

మరిన్ని వార్తలు