కండలవీరుడి ప్రచారం కలిసొచ్చేనా..?

19 Mar, 2019 19:03 IST|Sakshi

భోపాల్‌ : స్టార్‌ క్యాంపెయినర్‌లు ఎంతమంది ఉన్నా సినీ తారలు ప్రచారం చేస్తే ఆ కిక్కే వేరప్పా అంటూ అభ్యర్ధులు సినీ నటుల ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు సినీ గ్లామర్‌ ఉపకరిస్తుందని ఆశిస్తుంటారు. ఇదే కోవలో ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ను రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇండోర్‌లో ప్రచారం చేసేలా మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రయత్నిస్తున్నారు. 1965లో ఇండోర్‌లో జన్మించిన సల్మాన్‌ ముంబైకి వెళ్లక ముందు బాల్యమంతా అక్కడే గడిచిందని కాంగ్రెస్‌ నేతలు గుర్తుచేస్తున్నారు. 

ఇండోర్‌లో తమ పార్టీ తరపున ప్రచారం చేపట్టేందుకు బాలీవుడ్‌ కండలవీరుడితో ఇప్పటికే పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారని, త్వరలోనే ఆయన కాంగ్రెస్‌ తరపున ప్రచారం చేస్తారని మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర శాఖ ప్రతినిధి పంకజ్‌ చతుర్వేది తెలిపారు. సల్మాన్‌ తాత ఇండోర్‌లో సీనియర్‌ పోలీస్‌ అధికారిగా పనిచేశారని, సల్మాన్‌ బాల్యమంతా ఇక్కడే సాగిందని ఆయన వెల్లడించారు.

మధ్యప్రదేశ్‌లో భారీసంఖ్యలో సల్మాన్‌కు అభిమానులున్నారని ఆయన ప్రచారంతో ఇండోర్‌లో తమ పార్టీ విజయావకాశాలు మెరుగవుతాయని ఆయన చెప్పుకొచ్చారు. కాగా 1989లో సుమిత్రా మహజన్‌ అప్పటి సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం ప్రకాష్‌ చంద్ర సేథిని ఓడించడం ద్వారా బీజేపీకి ఇండోర్‌ను కంచుకోటగా మార్చారు. మహజన్‌ అప్పటి నుంచి ఈ స్ధానాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు.

మరోవైపు 2009లో కాంగ్రెస్‌ ఇండోర్‌ మేయర్‌ అభ్యర్థి పంకజ్‌ సంఘవి తరపున సల్మాన్‌ రోడ్‌షోలో పాల్గొన్నారు.  అయితే అప్పట్లో కండలవీరుడి ప్రచారం కాంగ్రెస్‌కు కలిసిరాలేదు. కాంగ్రెస్‌ మేయర్‌ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి ఘనవిజయం సాధించి మేయర్‌ పీఠమెక్కారు. ఇక ఏప్రిల్‌ 29 నుంచి నాలుగు దశల్లో మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తారు. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.

మరిన్ని వార్తలు