కలిసి పుట్టారు... డాక్టర్లకే పరీక్ష పెట్టారు..!

4 Jun, 2016 20:35 IST|Sakshi
కలిసి పుట్టారు... డాక్టర్లకే పరీక్ష పెట్టారు..!

పట్నా: అవిభక్త కవలలు జన్మించడం గురించి అప్పుడప్పుడు వింటుంటాం. అయితే బిహార్ లో మాత్రం బుధవారం జన్మించిన అవిభక్త కవలలు డాక్టర్లకే పరీక్ష పెట్టారు. శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని ఇద్దరు చిన్నారులు పంచుకున్నట్లుగా పుట్టారు. ఓ చిన్నారుల జెండర్ విషయాలపై డాక్టర్లకు ఇప్పటికీ స్పష్టతలేదంటేనే పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.

ఆ వివరాలిలా ఉన్నాయి.. బిహార్ కు చెందిన శివరాణి దేవి, చోటా సింగ్ దంపతులు. అయితే నొప్పులు రావడంతో శివరాణిని కాన్పు కోసం బక్సార్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఇద్దరు శిశువులకు జన్మనిచ్చింది. అయితే చిన్నారులలో ఒకరు ఆడ శిశువు కాగా, మరో శిశువు జెండర్ ఏంటన్నది డాక్టర్లకు తెలియడం లేదు. చిన్నారుల పరిస్థితి కాస్త సీరియస్ గా ఉండటంతో సర్దార్ పటేల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. రెండో శిశువు మగ శిశువు అయి ఉండొచ్చునని డాక్టర్ రాజ్ కుమార్ గుప్తా భావిస్తున్నారు.

సాధారణంగా అవిభక్త కవలలు ఒకే జెండర్ వాళ్లు పుడతారని చెప్పారు. అయితే చిన్నారుల తండ్రికి మెడికల్ ఖర్చులు భరించే స్థోమత లేదంటున్నాడు. వీరికి ఇప్పటికే ఇద్దరు సంతానం ఉన్నారు. ఓ బాబు, ఓ పాప ఉండగా, ప్రస్తుత కాన్పులో చోటా సింగ్ భార్య కవలలకు జన్మినిచ్చింది. చిన్నారులకు మరికొన్ని రోజులపాటు మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుంది. వీరిని రక్షించుకోవాలంటే ఢిల్లీ లాంటి పెద్ద నగరాలలో చికిత్స ఇప్పించాల్సి ఉంటుందని, తాను మాములు ఫ్యాక్టరీ పనివాడినంటూ చోటా సింగ్ వాపోతున్నాడు.

మరిన్ని వార్తలు