పంటరుణాల వడ్డీపై సబ్సిడీ కొనసాగింపు

11 Dec, 2014 01:59 IST|Sakshi

కేంద్ర కేబినెట్ నిర్ణయం
నాబార్డ్‌కు రూ. 4399 కోట్లు
విద్యుత్ చట్ట సవరణకు ఓకే

 
న్యూఢిల్లీ: స్వల్పకాలిక పంట రుణాల వడ్డీపై సబ్సిడీ సదుపాయాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 3 లక్షల వరకు రుణంపై సంవత్సరానికి 7% వడ్డీ, అలాగే 2014-15 సంవత్సరానికి రుణం తీసుకున్నవారు సమయానికి రుణం చెల్లిస్తే.. వారికి అదనంగా 3% వడ్డీ తగ్గింపు సదుపాయం అందించాలన్న ప్రతిపాదనకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది. ఇందుకోసం రూ. 18,583 కోట్లను విడుదల చేసేందుకు అంగీకరించింది. అందులో రూ. 4,399 కోట్ల ఆర్థిక సాయాన్ని సహకార బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రీఫైనాన్స్ కోసం నాబార్డ్‌కు అందించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ ఉన్న చిన్న రైతులకు వడ్డీపై సబ్సీడీ ఇవ్వనున్నారు.

 కబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు..

► లోక్‌పాల్ చైర్మన్, సభ్యుల నియామక కమిటీలో లోక్‌సభలో అత్యధిక స్థానాలున్న ప్రతిపక్ష పార్టీ నేతకు స్థానం కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.
► 500 మెగావాట్ల సామర్ధ్యంతో వివిధ రాష్ట్రాల్లో 25 సోలార్ పార్క్‌ల ఏర్పాటుకు రూ. 4050 కోట్ల ఆర్థిక సాయం .
►  మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం భూ బదిలీ వేగవంతంగా జరిగేలా చర్యలు. ప్రాజెక్టు కోసం తీసుకున్న భూమికి ఇకపై నగదు పరిహారమే
►  సంస్కరణలకు ఊతమిచ్చేలా విద్యుత్ చట్టంలో సవరణలకు అంగీకారం.
►  చక్కెర మిల్లులకు శుభవార్త. ఇథనాల్ సేకరణ రేటును లీటరుకు రూ. 48.50 నుంచి రూ. 49.50 మధ్యగా నిర్ణయించారు.
►  తమిళనాడులో రూ. 1593 కోట్లతో అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం.
 
 

మరిన్ని వార్తలు