రాజా హరీందర్‌ సింగ్‌ ఆస్తుల కేసు.. హైకోర్టు తీర్పు

2 Jun, 2020 12:21 IST|Sakshi

చండీగఢ్‌‌: దివంగత ఫరీద్‌కోట్‌ మహారాజాకు చెందిన దాదాపు రూ.20,000 కోట్ల విలువైన ఆస్తిని.. ఆయన కుమార్తెలకు వారసత్వంగా మంజూరు చేస్తు‌ హర్యానా హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిలో మణిమజ్రా కోట, సిమ్లా మషోబ్రాలోని ఆస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, ఆభరణాలు, పాతకాలపు కార్లు, ఢిల్లీ ఇండియా గేట్ సమీపంలోని కోపర్నికస్ మార్గ్ వద్ద ఉన్న ఫరీద్‌కోట్‌ హౌస్‌ ఉన్నాయి. కుమార్తెలు రాజ్‌కుమారి అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ ఇద్దరికీ ఈ ఆస్తిలో 75 శాతం వాటా లభిస్తుందని కోర్టు తెలిపింది. మిగిలిన 25 శాతం వాటా వారి తల్లి మహారాణి మహీందర్ కౌర్‌కు చెందుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్ తన 547 పేజీల తీర్పులో ఇద్దరు కుమార్తెల హక్కులను సమర్థించారు. మహారావల్ కేవాజీ ట్రస్ట్‌, దీపిందర్ కౌర్ చేసిన విజ్ఞప్తులను తోసిపుచ్చారు.అంతేకాక ఫరీద్‌కోట్ పాలకుడు రాజా హరీందర్ సింగ్ బ్రార్ మరణించినప్పుడు మహారాణి మహేంద్ర కౌర్ సజీవంగా ఉన్నారని.. ఆమెకు కూడా ఆస్తిలో వాటా ఉంటుందని కోర్టు తెలిపింది.

అయితే ప్రస్తుతం మహారాణి మహీందర్ కౌర్, ఆమె కుమార్తె దీపిందర్ కౌర్ ఇద్దరూ మరణించారు. దాంతో ఈ ఇద్దరి వాటాలు వారి చట్టపరమైన వారసులకు వెళ్తాయని కోర్టు తెలిపింది. ఇప్పటివరకు ఆస్తులను నిర్వహిస్తున్న మహారావల్ ఖేవాజీ ట్రస్ట్ చట్టవిరుద్ధమని ప్రకటించిన దిగువ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. దిగువ కోర్టు 2013 జూలై 25న తన తీర్పులో.. దివంగత తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్న అమృత్ కౌర్‌కు వారసత్వాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాన్ని దీపిందర్‌ కౌర్‌ పై కోర్టులో సవాలు చేశారు. దీన్ని కోర్టు 2018లోనే కొట్టివేసింది. 

ఫరీద్‌కోట్‌ వివాదం...
1918 లో మూడేళ్ళ వయసులో పాలకుడిగా పట్టాభిషేకం పొందిన హరీందర్ ఫరీద్‌కోట్‌ ఎస్టేట్ చివరి పాలకుడు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు... అమృత్ కౌర్, దీపిందర్ కౌర్ , మహిపీందర్ కౌర్ కాగా ఒక కుమారుడు హర్‌మహిందర్ సింగ్ ఉన్నారు. కొడుకు 1981 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఏడుగురు సిక్కు రాచరికపు మహారాజులలో ఒకరైన హరీందర్ 1989లో మరణించాడు. చనిపోయేనాటికి ఆయనకు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్,ఢిల్లీ, హర్యానా మరియు చంఢీగడ్‌‌లో ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయి. 


అక్టోబర్ 1989 లో మహారాజా మరణించిన తర్వాత ఈ ఆస్తి వివాదం ప్రారంభమైంది. హరీందర్‌ కౌర్‌ మరణించిన తర్వాత ఓ విల్లు వెలుగులోకి వచ్చింది. ఈ విల్లును  1982లో రాసినట్లు దానిలో ఉంది. మహారాజా తన ఆస్తులను మహర్వాల్ ఖేవాజీ ట్రస్ట్‌కు ఇచ్చినట్లు విల్లు పేర్కొంది. అంతేకాక కుమార్తె దీపిందర్ కౌర్‌ అధ్వర్యంలో ఈ ట్రస్ట్‌ నడుస్తుంది. మూడవ కుమార్తె ఈ ట్రస్టుకు ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. రెండవ కుమార్తె అయిన అమృత్‌ కౌర్‌ 1952లో తండ్రికి ఇష్టం లేని వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఆమెకు ఈ ఆస్తిలో వాటాలేదని మహారాజా ప్రకటించారు. అయితే మహారాజు చనిపోయిన తర్వాత అమృత్‌ కౌర్‌ ఎస్టేట్ యాక్ట్, 1948 ఆధారంగా మొత్తం ఎస్టేట్ మీద దావా వేశారు. విల్లు నకిలీదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగానే మహారాజా మూడవ కుమార్తె మహిపీందర్ కౌర్ 2001లో కన్యగానే మరణించారు. 

మరో రెండు పిటిషన్లు..
అమృత్‌ కౌర్‌ మాదిరిగానే మహారాజా హరీందర్ సింగ్ సోదరుడు మంజిత్ ఇందర్ సింగ్ కుమారుడు భరతీందర్ సింగ్ జేష్ఠత్వ నియమాన్ని పేర్కొంటూ ఆస్తిపై తనకు హక్కు కల్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించాడు. తండ్రి రాసిన విల్లు ఆధారంగా తనకు ఆస్తిలో వాటా దక్కాలని దీపిందర్‌ కౌర్‌ దావా వేశారు. అయితే ఈ వివాదం నడుస్తుండగానే దీపిందర్‌ కౌర్‌ మరణించారు. ఈ వివాదానికికి సంబంధించి 2018లోనే  హర్యానా హై కోర్టు ట్రస్టు పాత్ర శూన్యమని ప్రకటించి కుమార్తెలకు ఆస్తిని ఇవ్వమని పేర్కొంది.

నేడు జస్టిస్ రాజ్‌మోహన్ సింగ్‌ 30ఏళ్ల ఈ వివాదానికి తుది తీర్పు ఇచ్చారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం రాజా హరీందర్ సింగ్  ఆస్తిలో ఆయన ఇద్దరు కుమార్తెలు అమృత్‌ కౌర్‌, దీపిందర్‌ కౌర్‌లతో పాటు మహారాణికి  వాటా ఉంటుందని కోర్టు తెలిపింది. ఆస్తిని స్వాధీనం చేసుకునే ఉద్దేశంతో ట్రస్ట్‌  ధర్మకర్తలు కుట్ర పన్నారని.. నకిలీ విల్లును సృష్టించారని కోర్టు వెల్లడించింది. 

మరిన్ని వార్తలు