ఆస్తి కోసం అమానుషం | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం అమానుషం

Published Thu, Oct 5 2023 2:57 AM

Atrocious incident in Vanaparthi district headquarters - Sakshi

వనపర్తి: ఆస్తి ముందు అన్నదమ్ముల అనుబంధం, చిన్నప్పటి నుంచి కలసి ఉన్న సోదర ప్రేమ చిన్నబోయాయి. నడిరోడ్డుపై సొంత తమ్ముళ్లే తోడబుట్టిన అన్నను కత్తులతో వేటాడి హత్య చేశారు. బుధవారం వనపర్తి జిల్లాకేంద్రంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి మండలం రాజపేట పెద్దతండాకు చెందిన మంగ్లీ, పూల్య నాయక్‌లకు ఐదుగురు కుమారులున్నారు. 20 ఎకరాల భూమిని తండ్రి తన కుమారులకు సమానంగా పంచి ఇచ్చాడు. రెండో కుమారుడు బద్రీనాథ్‌ నాయక్‌ (51) వీపనగండ్లలో ఏపీఓగా పనిచేస్తున్నారు.

ఆయనకు ముగ్గురూ ఆడపిల్లలే ఉండడంతో వంశోద్ధారకుడు లేడని.. తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిని పేదలైన తమ్ముళ్లకు ఇవ్వాలనే ప్రతిపాదన కుటుంబంలో తెచ్చారు. అందుకు బద్రీనాథ్‌ ఒప్పుకోకపోవడంతో, తాను పంచి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వాలని తండ్రి డిమాండ్‌ చేయడంతో పాటు కోర్టుకు సైతం వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. పదేళ్లుగా ఈ ఆస్తి వివాదం కోర్టులో కొనసాగుతుండగానే.. చాలాసార్లు ఘర్షణపడ్డారు. సోదరుల నుంచి ప్రాణభయం ఉండటంతో బద్రీనాథ్‌ కొంతకాలంగా బయట తిరిగే సందర్భంలో హతీరాం అనే వ్యక్తిని వెంటబెట్టుకునేవారు.

బుధవారం విధి నిర్వహణలో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చిన బద్రీనాథ్‌ తిరిగి వెళుతుండగా.. ఇద్దరు తమ్ముళ్లు సర్దార్‌ నాయక్, కోట్యా నాయక్‌తో పాటు సర్దార్‌ నాయక్‌ కుమారుడు పరమేశ్‌లు కాపుకాసి మరికుంట సమీపంలో కత్తులతో దాడి చేశారు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా నరకడంతో బద్రీనాథ్‌ అక్కడికక్కడే మృతి చెందారు. పక్కనే ఉన్న హతీరాంకు కత్తి గాయం కావడంతో భయంతో పరారయ్యాడు.

అనంతరం రెండు బైక్‌లపై నిందితులు అక్కడి నుంచి పారిపోయి.. వనపర్తి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితులు తమ అదుపులో ఉన్నట్లు పోలీసులు ధ్రువీకరించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ మహేశ్వర్‌రావు తెలిపారు.

Advertisement
Advertisement