ప్లాహాకు సారీ చెప్పిన వార్నర్‌

20 Jun, 2019 16:36 IST|Sakshi

లండన్‌ : ప్రపంచ కప్‌లో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందిస్తున్న తీరుకు క్రీడాభిమానులు ఫిదా అవుతున్నారు. గతంలో ఓ మ్యాచ్‌లో తనకు లభించిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ను బుల్లి ఫ్యాన్‌కు ఇచ్చి ఔదార్యం చాటుకున్న వార్నర్‌.. తాజాగా తన వల్ల గాయపడిన బౌలర్‌ ప్లాహాకు సారీ చెప్పి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని ఓవల్‌ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న ఆసీస్‌ క్రికెటర్లకు  23 ఏళ్ల జే కిషన్‌ ప్లాహా  అనే భారత సంతతికి చెందిన ఇంగ్లండ్‌ ఆటగాడు బౌలింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వార్నర్‌కి కూడా బంతులు వేశాడు. ఈ క్రమంలో ఓ బంతిని వార్నర్‌ బలంగా బాదడంతో అది ప్లాహాకు తగిలింది. దీంతో అతడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆస్ట్రేలియా ఫిజీషియన్స్‌, డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి ప్లాహను ఆస్పత్రికి తరలించారు.  

ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తనని చూడటానికి ఆసీస్‌ ఆటగాళ్లు ఆస్పత్రికి వచ్చారని ప్లాహా తెలిపాడు. వార్నర్‌ తన కొట్టిన షాట్‌కు సారీ చెబుతూ.. ఆత్మీయంగా కౌగిలించుకున్నాడని అతడు చెప్పాడు. దీంతో పాటు కంగారూ ఆటగాళ్లంతా ఆటోగ్రాఫ్స్‌ చేసిన ఆస్ట్రేలియా టీం జెర్సీని తనకు బహుమతిగా ఇచ్చారన్నాడు. తన కుటుంబ సభ్యులతో ప్రపంచ కప్‌ మ్యాచ్‌లు చూడటానికి టికెట్లు కూడా ఇచ్చారని చెప్పాడు. వార్నర్‌ స్పందించిన తీరును తన జీవితంలో మరిచిపోలేని సందర్భంగా ప్లాహా పేర్కొన్నాడు. ఈ ఘటనలతో ప్రపంచకప్‌లో ప్లాహా పేరు మారుమోగుతోంది. అదే విధంగా వార్నర్‌ స్పందించిన తీరుకు సగటు క్రీడా అభిమానులు ఫిదా అవుతున్నారు.

>
మరిన్ని వార్తలు