కేజ్రీవాల్‌పై ఢిల్లీ పోలీసుల చార్జిషీట్‌

13 Aug, 2018 15:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, 11 మంది ఆప్‌ ఎమ్మెల్యేలపై ఢిల్లీ పోలీసులు సోమవారం తీస్‌ హజారి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. వీరిలో కేజ్రీవాల్‌, సిసోడియా, మరో 9 మందిపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేశారు. మరో ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలపై చీఫ్‌ సెక్రటరీని కొట్టారనే అభియోగాలు మోపారు. ఫిబ్రవరి 19న చీఫ్‌ సెక్రటరీ అన్షు ప్రకాష్‌పై కేజ్రీవాల్‌ అధికార నివాసంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.

దాడి జరిగిన సమయంలో కేజ్రీవాల్‌ అక్కడే ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కేజ్రీవాల్‌ సహా దాడి సమయంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా, 11 మంది ఆప్‌ ఎమ్మెల్యేలను ఇప్పటికే పోలీసులు ప్రశ్నించారు. దాడి కేసుకు సంబంధించి ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు అమనతుల్లా ఖాన్‌, ప్రకాష్‌ జర్వాల్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఈ ఘటన ఢిల్లీ ప్రభుత్వం, ఐఏఎస్‌ అధికారుల మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది. ఇక ఆప్‌ ఎమ్మెల్యేలకు, బ్యూరోక్రాట్లకు మధ్య సాగుతున్న వివాదం తాజా చార్జిషీట్‌తో మరింత ముదిరింది.

మరిన్ని వార్తలు