సివిల్స్ టాపర్ టీనా దాబి

11 May, 2016 03:53 IST|Sakshi
సివిల్స్ టాపర్ టీనా దాబి

తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించిన ఢిల్లీ యువతి
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్-2015 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) మంగళవారం ప్రకటించింది. ఈ ఫలితాల్లో ఢిల్లీకి చెందిన యువతి టీనా దాబి దేశవ్యాప్తంగా మొదటి ర్యాంకును కైవసం చేసుకుంది. తన తొలి ప్రయత్నంలోనే టీనా దాబి సివిల్స్‌లో టాప్ ర్యాంక్ దక్కించుకోవడం గమనార్హం. 22 ఏళ్ల టీనా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. తనకు సివిల్స్‌లో తొలి ర్యాంకు లభించడంపై ఆమె స్పందిస్తూ.. ఇది తాను నిజంగా గర్వపడే సమయమని చెప్పారు.

జమ్మూకశ్మీర్‌కు చెందిన రైల్వే అధికారి అతర్ ఆమిర్ ఉల్ షఫీ ఖాన్ రెండో స్థానం దక్కించుకున్నాడు. అనంత్‌నాగ్‌కు చెందిన 22 ఏళ్ల అతర్ తన రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో విజయం సాధించాడు. 2014లో అతను తొలి ప్రయత్నంలో ఇండియన్ రైల్ ట్రాఫిక్ సర్వీస్(ఐఆర్‌టీఎస్)కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం లక్నోలోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది తన కల నిజమైన సమయమని అతన్ ఫలితాల విడుదల తర్వాత చెప్పాడు.

ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్నీ తాను సద్వినియోగం చేసుకుంటానని చెప్పాడు. ఇక ఢిల్లీకే చెందిన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ అధికారి జస్మిత్ సింగ్ సంధు మూడో స్థానం సాధించారు. జస్మిత్ తన నాలుగో ప్రయత్నంలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. 2014లో అతను ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు ఎంపికైన జస్మిత్.. ప్రస్తుతం ఫరిదాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్‌లో శిక్షణ పొందుతున్నాడు. తన విజయానికి తల్లిదండ్రులు, టీచర్లే కారణమని చెప్పారు.
 
వెయిటింగ్ లిస్ట్‌లో 172 మంది
మొత్తం 1,078 మంది అభ్యర్థులు ఈ ఏడాది సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ వెల్లడించింది. ఇందులో జనరల్ కేటగిరీకి చెందిన వారు 499 మంది, ఓబీసీలు 314, ఎస్‌సీ అభ్యర్థులు 176, ఎస్‌టీ అభ్యర్థులు 89 మంది ఉన్నారు. మరో 172 మంది అభ్యర్థులను వెయిటింగ్ లిస్ట్‌లో పెట్టింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ సర్వీసుల్లో వీరికి అపాయింట్‌మెంట్ ఇవ్వాలని యూపీఎస్‌పీ సిఫారసు చేసింది.

మరిన్ని వార్తలు