మన పిల్లలకు అండగా నిలుద్దాం

20 Aug, 2023 04:41 IST|Sakshi

అమెరికా నుంచి తెలుగు విద్యార్థులను వెనక్కి పంపిన ఘటనపై సీఎం జగన్‌ ఆరా

పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులకు ఆదేశం 

విదేశీ వ్యవహారాల శాఖతో చర్చించాలని సూచన

ఏపీఎన్‌ఆర్టీఎస్‌ ద్వారా ఇమ్మిగ్రేషన్‌ సహాయం.. అమెరికా వెళ్లే వారి కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు  

వెనక్కి పంపిన విద్యార్థులను తిరిగి పంపేలా విదేశాంగ శాఖతో చర్చలు

సాక్షి, అమరావతి: అమెరికా వెనక్కు పంపిన భారతీయ విద్యార్థుల్లో కొంత మంది తెలుగు విద్యార్థులూ ఉన్నారనే విషయంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఆరా తీశారు. ఆ విద్యార్థుల పూర్తి వివరాలు తెలుసుకుని, వారికి అండగా నిలవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. అమెరికాలో ఇమ్మిగ్రేషన్‌ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్ర విద్యార్థుల కోసం సీఎం ఆదేశాల మేరకు.. ప్రభుత్వం వేగంగా స్పందించి పలు కీలక నిర్ణయాలు తీసుకొంది.

విదేశాంగ శాఖతో మాట్లాడి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి సారించారు. వెనక్కి వచ్చిన విద్యార్థులు వ్యాలిడ్‌ వీసాలను కలిగి ఉండటంతో వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యను త్వరగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికా నుంచి బహిష్కరణకు గురైన తెలుగు విద్యార్థులు ఏపీఎన్‌ఆర్టీఎస్‌ను సంప్రదించాలని అధ్యక్షుడు వెంకట్‌ ఎస్‌ మేడపాటి తెలిపారు. ఇందుకోసం ఏపీఎన్‌ఆర్టీఎస్‌ ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ కేటాయించిందన్నారు. ఈ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 24 గంటలు అందుబాటులో ఉంటుందని,  +91 8632340678, 8500027678 సంప్రదించాలని సూచించారు. లేదా  info@apnrts.com,  helpline@apnrts.com  కు మెయిల్‌ చేయాలని చెప్పారు. 

నిబంధనలు క్షుణ్ణంగా తెలుసుకోండి
అమెరికా వీసా ఉన్నంత మాత్రాన ఆ దేశంలోకి ప్రవేశమనేది గ్యారెంటీ కాదని, విద్యార్థులు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ (పోర్ట్‌ ఆఫ్‌ ఎంట్రీ) వద్ద కస్టమ్స్, బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ) అధికారులు అడిగే అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు. లాప్‌టాప్, మొబైల్‌లో అమెరికా నిబంధనలను ఉల్లంఘించేలా సందేశాలు (పార్ట్‌టైమ్‌ జాబ్, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ మేనేజ్‌ తదితర) ఉండకూడదని తెలిపారు. ఆ దేశంలోకి ప్రవేశం ఎందుకనే అంశాన్ని చెప్పి, వారిని ఒప్పించాల్సి ఉంటుందన్నారు.

ఈ విషయంలో ముందుగానే విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. విద్యార్థి దశలో అమెరికాలో జీవించడానికి అవసరమైన ఆర్థిక స్థోమతకు తగిన రుజువులు, యూనివర్సిటీ అడ్మిషన్‌ లెటర్, తదితరాల గురించి మన విద్యార్థులను అడిగినప్పుడు సంతృప్తికర సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులు యూఎస్‌ ఇమ్మిగ్రేషన్‌ చట్టాలను ఉల్లంఘించే అవకాశం ఉందని వారు భావిస్తారని చెప్పారు. ఈ విషయాలపై విద్యార్థులు ముందుగానే అవగాహన పెంచుకోవాలని చెబుతున్నారు. పేరున్న ఏజెన్సీల ద్వారానే విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు.    

మరిన్ని వార్తలు