రాజధానిలో విజృంభిస్తున్న డెంగీ

21 Jul, 2015 16:22 IST|Sakshi
రాజధానిలో విజృంభిస్తున్న డెంగీ

న్యూఢిల్లీ: దేశరాజధాని నగరం ఢిల్లీలో డెంగీ మళ్లీ  పంజా విసురుతోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక నెల రోజుల్లోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందా అన్న భయాందోళనలు నెలకొన్నాయి. మున్సిపల్ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం జూలైలో అధిక  కేసులు రికార్డయ్యాయి.

దక్షిణ ఢిల్లీ మున్సిపల్ పరిధిలో ఇటీవల ఒక వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారించడంతో  డెంగీ పీడితుల సంఖ్య 30కి చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యమంత్రి జెపీ నడ్డా వివిధ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డెంగీ వ్యాధికి సంబంధించి అన్ని  తగిన  జాగ్రత్తలు తీసుకోవాలని ఆస్పత్రుల యాజమాన్యాలను ఆదేశించారు.


అయితే వర్షాకాల ప్రభావంతోనే  జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, ఆందోళన చెందాల్సిన అసరం లేదని నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి మంగళవారం తెలిపారు.  అన్ని ముందుజాగ్రత్తలు  తీసుకుంటున్నామని తెలిపారు.  యాంటీ డెంగీ డ్రైవ్ చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో  ఉండే వాతావరణం పరిస్థితులపైనే వ్యాధి తీవ్రత ఆధారపడి  ఉంటుందని పేర్కొన్నారు.


కాగా గత  ఐదేళ్లుగా డెంగీ  వ్యాధి ఢిల్లీ ప్రజలను వణికిస్తోంది. 2008లో 1,300  కేసులు,  2009లో 1,153  కేసులు , 2011-12లో వెయ్యికి పైగా , 2013లో  5,500 కేసులు,  2014లో 1,000 కేసులు నమోదయ్యాయి.  2010  సంవత్సరంలో అత్యధికంగా  ఆరువేల కేసులు నమోదయ్యాయి.  పదుల సంఖ్యలో మరణాలు  సంభవించాయి. దీంతో ఢిల్లీ నగరవాసుల్లో డెంగీ  భయాందోళనలు కలిగిస్తోంది.

మరిన్ని వార్తలు