Dengue Cases In Telangana: పగటి దోమ కాటు ప్రాణాంతకమే!

25 Sep, 2023 03:43 IST|Sakshi

పగటివేళ కుట్టే ఏడిస్‌ ఈజిప్టి దోమలు 

నిల్వ నీటివల్లే దోమల ఉత్పత్తి 

రాష్ట్రవ్యాప్తంగా 3వేలకు పైగా డెంగీ కేసులు  

అందులో సగానికి పైగా హైదరాబాద్‌లోనే..

పగటిపూట కుట్టే దోమ ప్రాణాంతకంగా పరిణమించింది. డెంగీ వ్యాప్తికి కారణమైన ఏడిస్‌ ఈజిప్టి దోమలతో జ్వర బాధితులు పెరుగుతున్నారు. డెంగీ కారక దోమల బెడద నుంచి రక్షించుకోవడమే శ్రేయస్కరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దోమల ఉత్పత్తికి కారణమయ్యే నిల్వ నీరు లేకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.     – సాక్షి, హైదరాబాద్‌

వానలు కురిసి తగ్గిన తర్వాత సీజన్‌లో సాధారణంగా డెంగీ వ్యాపిస్తుంది.. కానీ ఈ వ్యాధి ప్రస్తుతం నగరవ్యాప్తంగా ప్రబలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకుపైగా డెంగీ కేసులు నమోదైతే.. అందులో సగానికి పైగా నగరంలో నమోదవడం వ్యాధి తీవ్రతకు నిదర్శనం. గత ఆగస్టు నుంచి నెలకు 10 రెట్ల చొప్పున కేసులు పెరుగుతు­న్నాయని ఆసుపత్రుల గణాంకాలు చెబుతున్నాయి. డెంగీ జ్వరం వస్తే శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపధ్యంలో దోమల నివారణకు నగర ప్రజలు ప్రాధాన్యమివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఏడిస్‌ ఈజిప్టి దోమ కాటేసే వేళలివే.. 
డెంగీకి దోహదం చేసే ఏడిస్‌ ఈజిప్టి అనే దోమనే ఎల్లో ఫీవర్‌ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. ఈ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో దోమలు కుట్టకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయని గ్రహించాలి. వీలుంటే ఆయా శరీర భాగాల్లో మనకు మార్కెట్లో లభించే దోమల నివారణ లేపనం పూయాలి. 

నిల్వ నీరే స్థావరాలు  
నీరు నిల్వ ఉన్న చోట, తడి ప్రదేశాలలో ఈ దోమ­లు విపరీతంగా గుడ్లను పొదుగుతాయి. అవి మూడేళ్ల వరకు జీవించగలవు. కాబట్టి ఇంట్లో లేదా మరెక్కడైనా సరే మూలల్లో తడిగా, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. కొందరు మొక్కల కుండీల్లో నీటిని వదిలేస్తారు. అది కూడా ఈ దోమలకు స్థావరంగా మారుతుందని గుర్తుంచుకోవాలి.

దోమను ఎలా గుర్తించాలంటే.. 
ఏడిస్‌ ఈజిప్టి దోమను గుర్తించడానికి సులభ­మైన మార్గం వాటి నలుపు రంగు. కాళ్లపై తెల్లటి మచ్చలుంటాయి. దోమలను బయటకు తరిమికొట్టేందుకు ఇప్పుడు మార్కెట్లో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్‌ సహా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో చాలా వరకూ పరోక్షంగా ఆరోగ్యానికి హాని కలిగించేవే. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్యం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి. 

  • తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది.  
  • లెమన్ గ్రాస్‌ ఆయిల్‌: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్‌ ఆయిల్‌ను చాలాకాలంగా ఉప­యో­గిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది.  
  • లావెండర్‌ ఆయిల్‌: చర్మంపై లావెండర్‌ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు  కుట్టవు.
  • పిప్పరమింట్‌ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్‌లో నింపాలి. పిప్పరమింట్‌ ఆయిల్‌ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. 
  • యూకలిప్టస్‌ ఆయిల్‌: నిమ్మకాయ,యూకలిప్టస్‌ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్‌లో నింపాలి. ఈ మిశ్రమాన్ని  శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. 
మరిన్ని వార్తలు