మూడు నెలల్లో తేల్చాల్సిందే

6 Dec, 2017 01:52 IST|Sakshi

ఫిరాయింపుల ఫిర్యాదులపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య

శరద్‌యాదవ్‌ పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకే వేటు

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, న్యూఢిల్లీ: చట్టసభల సభ్యుల అనర్హతపై నిర్ణయం ఆలస్యమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసినట్లేనని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. సభ్యుల అనర్హతపై అందిన ఫిర్యాదులను ఆయా సభల ప్రిసైడింగ్‌ అధికారులు పరిశీలించి మూడు నెలలలోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జనతాదళ్‌(యు)కు చెందిన శరద్‌ యాదవ్, అలీ అన్వర్‌లు ఇద్దరూ తమ పార్టీలోని మెజారిటీ సభ్యుల మద్దతు కోల్పోవటంతోపాటు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నందునే వారిని రాజ్యసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించామని రాజ్యసభ చైర్మన్‌ కూడా అయిన వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

అనర్హత ఉత్తర్వులను మంగళవారం ఆయన విడుదల చేశారు. వీరిపై ఫిర్యాదు అందిన నెలలోపే విచారించి నిర్ణయం తీసుకున్నామన్నారు. పిటిషన్లను ప్రివిలేజ్‌ కమిటీకి పంపితే అక్కడ విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు సమయం పడుతుందని..ఆపైన అంతిమ నిర్ణయం ప్రకటించేందుకు మరింత జాప్యం అవుతుందని తెలిపారు. ఇలాంటి కాలయాపన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాబట్టే పిటిషన్లను ప్రివిలేజ్‌ కమిటీకి పంపించలేదని తెలిపారు. ప్రజాస్వామ్య మనుగడకు కీలకమైన చట్టసభల సభ్యులపై అందిన ఫిర్యాదు వెంటనే పరిశీలించినట్లయితే.. వారు సభలో కూర్చునేందుకు అర్హులా కాదా అనేది తేలుతుందని.. అలా కాకుండా జాప్యం చేస్తే వారి సభ్యత్వాన్ని కాపాడినట్లవుతుందని తెలిపారు.

ఇటువంటి సభ్యుల అండతో ప్రభుత్వాలు కూడా కొనసాగే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఫిర్యాదు అందిన వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతే ఫిరాయింపుతో కలిగే పరిణామాలు తెలియకుండానే ఆ సభ్యుడు కొనసాగే అవకాశముందన్నారు. ఇటువంటి పరిణామాలు ఫిరాయింపుల చట్టం అసలు ఉద్దేశాన్ని మరుగున పరుస్తాయని తెలిపారు. ఎవరైనా సభ్యుడు తమ పార్టీ నిర్ణయంపై బహిరంగంగా విమర్శించినా, వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా అనర్హులేనని రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌చెబుతోందన్నారు. లెజిస్లేచర్‌ పార్టీ నాయకత్వంపై వివాదం తలెత్తిన సందర్భాల్లో మెజారిటీ సభ్యులు తీసుకునే నిర్ణయం లేదా అభిప్రాయానికే అంగీకారం ఉంటుందని చెప్పారు.

అలాగే, జేడీ(యు)కు చెందిన శరద్‌యాదవ్‌కు మెజారిటీ సభ్యుల మద్దతు లేదని, అందుకే ఆ పార్టీకి నితీష్‌కుమార్‌నే అధ్యక్షుడిగా ఎన్నికల సంఘం కూడా గుర్తించిందని వివరించారు. బిహార్‌లోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు నితీష్‌కుమార్‌ ప్రకటించినందున జేడీ(యు) సభ్యత్వాన్ని ఆయన స్వచ్ఛందంగా వదులుకున్నట్లేనన్న నితీష్‌కుమార్‌ వాదనపై ఆయన స్పందిస్తూ... రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో రాజకీయ పార్టీల కూటములకు ఎలాంటి గుర్తింపు లేదన్నారు. కాగా, అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం చేస్తున్న ప్రిసైడింగ్‌ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ప్రిసైడింగ్‌ అధికారులు చేస్తున్న అనవసర జాప్యంపై సుప్రీంకోర్టు కూడా అభ్యంతరం తెలిపిందని పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు