జీన్స్, టీషర్ట్స్‌తో రావొద్దు.. మొబైల్‌ వాడొద్దు

23 Mar, 2017 22:36 IST|Sakshi
జీన్స్, టీషర్ట్స్‌తో రావొద్దు.. మొబైల్‌ వాడొద్దు

టీచర్లకు లక్నో డీఈవో ఆదేశాలు
లక్నో: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఆహార్యంలో మరింత హుందాగా ఉండాలని ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా విద్యాధికారి టీచర్లకు సూచించారు. టీచర్లెవరూ ఇకపై టీషర్ట్‌లు, జీన్స్‌ ప్యాంట్లు ధరించి పాఠశాలకు రావొద్దని ఆదేశించారు. ‘వృత్తి గౌరవం పెంచేలా ఉపాధ్యాయుల వస్త్రధారణ ఉండాలి.. అందుకే అటువంటి దుస్తులను ధరించి పాఠశాలలకు రావొద్దు' అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని చెప్పారు.

అంతేకాకుండా పనివేళల్లో మొబైల్‌ ఫోన్స్‌ వినియోగించడం మంచిది కాదని, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని,  అన్ని పాఠశాలలో తప్పనిసరిగా ఉదయం పూట ప్రార్థన జరిగేలా చూడాలని పేర్కొన్నారు. పాఠశాలలకు సమీపంలో పాన్‌మసాలా, సిగరెట్లు విక్రయించే దుకాణాలు కనిపిస్తే వెంటనే వాటిని మూసివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు జీన్సు ధరించి రావొద్దంటూ గతేడాది హరియాణా ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు