'గుడ్లు' తేలేయాల్సిందే!!

5 Jul, 2014 14:52 IST|Sakshi
'గుడ్లు' తేలేయాల్సిందే!!

కేకు అన్న మాట చెబితే చాలు.. కేక పెట్టాల్సిందే. గుడ్డు అంటే చాలు.. గుడ్లు తేలేయాల్సిందే. అవును.. ముంబై మహానగరంలో కోడిగుడ్ల ధరలు మండిపోతున్నాయి. ఒక్కో గుడ్డు ఐదు రూపాయలు. అంటే, డజను 60 రూపాయలకు తక్కువ ఎక్కడా దొరకట్లేదు. దీంతో బేకరీ యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నాయి. ముంబైలోనే అతిపెద్ద బేకరీలలో ఒకటైన మోడ్రన్ బ్రెడ్.. జూన్ 26 నుంచి తమ గోరెగావ్ యూనిట్లో ఉత్పత్తి నిలిపివేసింది. అలాగే బ్రిటానియా, విబ్స్ కూడా ఉత్పత్తులను చాలావరకు ఆపేశాయి. తమ ఫ్యాక్టరీలో ఓ ప్రమాదం సంభవించడంతో ఇక్కడ భద్రతా చర్యలను పటిష్ఠం చేయడానికే ఫ్యాక్టరీ మూసేసినట్లు మోడ్రన్ బ్రెడ్ యాజమాన్య సంస్థ హిందూస్థాన్ లీవర్ చెబుతున్నా.. అసలు కారణం మాత్రం కోడిగుడ్ల ధరేనని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ సహా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో కోడిగుడ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. అందుకే ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని అంటున్నారు. అందుకే ముంబై రిటైల్ మార్కెట్లలో ఒక్కో గుడ్డు 5 రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్లో కూడా చిల్లర ధర దాదాపు 4.50 వరకు పలుకుతోంది.

మరిన్ని వార్తలు