ముగిసిన ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ – 2017

12 Aug, 2017 01:56 IST|Sakshi
ముగిసిన ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ – 2017
- హాజరైన 1200 మందికిపైగా శాస్త్రవేత్తలు, విద్యా, వ్యాపారవేత్తలు
- మానవరహిత వాహనాల తయారీ, రోబోటిక్‌ టెక్నాలజీ అభివృద్ధే ధ్యేయం
- 2018 ఇండియన్‌ కాంగ్రెస్‌ నాటికి మంచి ఫలితాలు సాధిస్తామన్న ఐటీసీ చైర్మన్‌ 
- ‘సాక్షి’కి ప్రత్యేక అభినందనలతోపాటు సర్టిఫికెట్‌
 
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఐదేళ్ల కిందట జర్మనీలో మొదలైన పారిశ్రామిక విప్లవం (4.0) అభివృద్ధి చెందిన దేశాల్లో వేగంగా ఫలితాలు ఇస్తోంది. ఈ క్రమంలో ఇండియా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుని పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగతిని సాధించాలని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, పారిశ్రామిక, విద్యావేత్తలు దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలని ఇండియన్‌ టెక్నాలజీ కాంగ్రెస్‌ చైర్మన్‌ ఎల్‌.వి.మురళీకృష్ణారెడ్డి అన్నారు. బెంగళూరులోని నిమ్‌హాన్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో రెండు రోజుల పాటు జరిగిన సదస్సు శుక్రవారం ముగిసింది. కార్యక్రమానికి ఐటీసీ నేషనల్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్‌ ఆర్‌ఎం వాసగన్‌ అధ్యక్షత వహించారు. ఇస్రోకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త సీజే జగదీశా నివేదిక సమర్పించారు. సదస్సుకు 1200 మందికిపైగా స్వదేశీ, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. పారిశ్రామిక, టెక్నాలజీ, వ్యవసాయ రంగాలపై 121 ప్రజంటేషన్లు ఇచ్చారు. పారిశ్రామిక రంగం లో 4, వ్యవసాయ రంగంలో 9 తీర్మానాలు చేశారు. 
 
2025 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యం
2018 కాంగ్రెస్‌ నాటికి ఈ తీర్మానాల ఫలితాలు సాధించేలా అంతా చొరవ చూపాలని మురళీ కృష్ణారెడ్డి కోరారు. 2025 నాటికి భారత్‌ 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వృద్ధిని సాధించేలా చేయడమే లక్ష్యమని ఆయన అన్నారు. పారిశ్రామిక, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు అంకిత భావంతో పనిచేసి సరికొత్త టెక్నాలజీని అందించాలన్నారు. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో శ్రామికుల కొరత తీవ్రంగా ఉందని, భవిష్యత్‌లో ఇది మరింత ప్రమాదకర స్థాయికి చేరుతుందన్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే రోబోటిక్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయాలన్నారు. దీనివల్ల సమస్య పరిష్కారంతోపాటు కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందన్నారు. ప్రస్తుతం భారత్‌ తయారీ రంగంలో వేగంగా అభివృద్ధి సాధిస్తోందని, 2050 నాటికి ప్రపంచానికే భారత్‌ తయారీ కేంద్రంగా మారాలన్నారు. ప్రముఖ శాస్త్రవేత్త సమీర్‌ పట్నాయక్‌ ప్రజంటేషన్‌ అందరినీ ఆకట్టుకుంది. 
 
కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
బెల్‌ కంపెనీ డైరెక్టర్‌ డాక్టర్‌ రవిశంకరన్‌ మాట్లాడుతూ భారత్‌లో పారిశ్రామిక విప్లవం వెనుకంజలో ఉండటానికి కారణం ఇక్కడి కంపెనీలు సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోకపోవడమేనన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలపైనే భారత్‌ అభివృద్ధి ఆధారపడి ఉందన్నారు. శాస్త్రవేత్తలు నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రపంచాన్ని శాసిస్తోన్న ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) ద్వారా కొత్త టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మెనాశ్‌ కంపెనీ ఇంజనీరింగ్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ డీన్‌ యాసిన్‌ బ్రిజ్‌మోన్‌ మాట్లాడుతూ.. ఇంజనీరింగ్‌లో వేగవంతమైన మార్పులు వస్తున్నాయని కొత్త టెక్నాలజీ ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులు దేశానికి అందించడంలో  శాస్త్రవేత్తలు చొరవ చూపాలన్నారు.

దేశంలోని మార్కెట్‌ రంగాన్ని మొత్తం ఒకే వేదికపైకి తెచ్చి పంట సాగు నుంచి మార్కెటింగ్‌ దాకా ధరలు, మార్కెటింగ్‌ పరిస్థితి రైతులకు తెలిసేలా కొత్త యాప్‌లను రూపొందించి అందుబాటులోకి తీసుకురావాలని అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ డివిజన్‌ బోర్డు చైర్మన్‌ అలగసుందరమ్‌ అన్నారు. రైతుల ఆదాయాన్ని 2025 నాటికి రెట్టింపు చేయాలని నాబార్డ్‌ చైర్‌ ప్రొఫెసర్‌ అయ్యప్పన్‌ ఆకాంక్షించారు.  కొత్త టెక్నాలజీపై టెక్నికల్‌ పేపర్లను కోడ్‌ చేసిన ప్రద్యోద్‌ అరమణి (బెంగళూరు), కేవీ జయప్రసాద్‌ (కొచ్చి), నాయక్‌ కృష్ణస్వామి (కర్ణాటక)లకు ప్రత్యేక అవార్డులు ఇచ్చారు. ఇస్రో, డీఆర్‌డీవో ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం విస్తృత కవరేజీపై సంతృప్తి వ్యక్తం చేస్తూ ‘సాక్షి’కి ప్రత్యేకంగా అభినందనలు తెలపడంతోపాటు సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.
మరిన్ని వార్తలు