తప్పుడు ఎన్నికల అఫిడవిట్‌ అవినీతి చర్యే

11 Sep, 2018 03:22 IST|Sakshi

అనర్హత వేటు వేసేలా చట్టం చేయాలని ఆదేశించలేం: సుప్రీం  

న్యూఢిల్లీ: ఎన్నికల సమయంలో అభ్యర్థులు తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయడాన్నీ అవినీతి చర్యగానే పరిగణించాలని సుప్రీంకోర్టు సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే, అలాంటి వ్యక్తులపై ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసేలా చట్టం తీసుకురావాలని పార్లమెంటును ఆదేశించలేమని సోమవారం స్పష్టం చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పులను సీరియస్‌గా పరిగణించాలంటూ బీజేపీ నేత, సీనియర్‌ న్యాయవాది అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పిటిషన్లన్నింటినీ ఒకేసారి విచారిస్తామని పేర్కొంది. ‘తప్పుడు ఎన్నికల అఫిడవిట్‌ విషయంలో సీరియస్‌గా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నాం.

తప్పుడు వివరాలు పొందుపరచడం నైతికంగా తప్పే. కానీ.. ఈ దిశగా సరైన చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ఆదేశించలేం. అవినీతి చర్యల్లో దీన్ని కూడా చేర్చాలని పార్లమెంటుకు సూచించలేం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ లా కమిషన్‌ కూడా తన 244వ నివేదికలో ఈ అంశాన్ని పేర్కొందని.. ఎన్నికల కమిషన్‌ కూడా రాజకీయాలను ప్రక్షాళన చేసేందుకు ఇలాంటి చర్యలు తప్పవని ప్రతిపాదించిన విషయాన్ని ఉపాధ్యాయ తరపు న్యాయవాది.. రాణా ముఖర్జీ కోర్టుకు గుర్తుచేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 125 (ఏ) ప్రకారం తప్పుడు అఫిడవిట్‌ సమర్పించిన వారికి ఆర్నెళ్ల జైలుశిక్ష విధించాలని చెబుతోందన్నారు. అయితే.. ఈ చట్టంలోని 123లో ఉన్న అవినీతి చర్యల్లో తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేయడాన్ని చేర్చనందునే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు.

మరిన్ని వార్తలు