ఏఎంయూలో హింస.. ఇద్దరి మృతి

25 Apr, 2016 01:07 IST|Sakshi
ఏఎంయూలో హింస.. ఇద్దరి మృతి

రెండు విద్యార్థి గ్రూపుల మధ్య కాల్పులు
 
 అలీగఢ్(ఉత్తరప్రదేశ్): అలీగఢ్ ముస్లిం వర్సిటీ(ఏఎంయూ)లో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య శనివారం అర్ధరాత్రి తలెత్తిన ఘర్షణ హింసకు దారితీసింది. రెండు గ్రూపులకు చెందినవారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఓ బహిష్కృత విద్యార్థి అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివీ.. క్యాంపస్‌లోని ముంతాజ్ హాస్టల్‌లో ఉంటున్న ఒకరిపై శనివారం అర్ధరాత్రి ప్రత్యర్థి విద్యార్థి గ్రూపునకు చెందినవారు దాడిచేసి అతనుంటున్న గదికి నిప్పంటించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు అతను వర్సిటీ క్రమశిక్షణాధికారి(ప్రోక్టర్) కార్యాలయానికి వెళ్లాడు.

ఈలోపు రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు అక్కడకు చేరడంతో ఘర్షణ మొదలైంది.  ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. కాల్పుల్లో మెహ్‌తాబ్ అనే బహిష్కృత విద్యార్థి మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులు ఓ జీపును, అరడజనుకుపైగా బైక్‌లను తగులపెట్టారు. ప్రోక్టర్ ఆఫీసుకూ నిప్పంటించారు. ర్యాపిడ్ యాక్షన్‌ఫోర్స్(ఆర్‌ఏఎఫ్) బలగాలు రెండు గంటలపాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మహమ్మద్ వకీఫ్ అనే యువకుడ్ని చికిత్సకోసం ఢిల్లీకి తరలించినా ఫలితం లేకపోయింది. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. యూపీలోని అజంగఢ్, సంభాల్ ప్రాంతాలకు చెందిన రెండు ప్రత్యర్థి గ్రూపుల మధ్య గొడవలు ఈ ఘర్షణకు దారితీశాయని ఏఎంయూ అధికారి ఒకరు చెప్పారు.

>
మరిన్ని వార్తలు