వేసవి | Sakshi
Sakshi News home page

వేసవి

Published Mon, Apr 25 2016 1:05 AM

వేసవి

కవిత
 
 తనని తాను బద్దలు కొట్టుకుంటూ
 ఎండ కనపడని లావాలను గ్రుమ్మరిస్తే
 నెర్రెలిస్తూ పగుళ్ళు బారి భూగోళం
 కణకణమండే గాడిపొయ్యవుతుంది
 
 ఊళ్ళన్నీ చెరువులను చప్పరించేసి
 కదలలేని వాగుల చేతులను కూడదీసుకొని
 ఆకాశంలో కనపడని మబ్బులకు
 దణ్ణాలు పెడుతుంటాయ్
 
 జ్వరంతో పుడమి వేడి సెగలు కక్కుతుంది
 పగటి తాకిడికి
 వడలి పోయిన రాత్రి
 ఉసూరంటూ ఆలస్యంగా వస్తుంటుంది
 
 చుక్కల గుడ్డలో
 చల్లటి చంద్రుణ్ణి చుట్టి
 నుదిటి మీద కప్పినా
 అర్ధరాత్రిగ్గాని వేడి తగ్గదు
 
 పచ్చదనాన్ని రియల్ ఎస్టేట్‌కి
 ఒక జీవితకాలం తాకట్టు పెట్టుకొని
 వడ్డీ కోసం ఒకోక్క చెట్టూ నరుక్కుంటూ పోగా
 ఒకటో అరో మిగిలిన చెట్టూ చేమ
 అక్కడక్కడో చలివేంద్రం పెట్టినా
 నిప్పులకుంపటి నెత్తిమీద పెట్టుకొని
 సెగలు కక్కుతున్న మధ్యాహ్నాలను
 తమ ఆకుల రెక్కలతో చల్లబరచలేక
 దిగులు పడి పోయుంటాయి చెట్లు
 
 నిలువ నీడలేక
 పిండాలతో ప్రాణాలు నిలుపుకోలేక
 గతించిపోయిన తమ సాటి పిచ్చుక జాతితో
 పోలేక పోయినందుకు వగస్తుంటాయ్ కాకులు
 
 ఇంటెన్సివ్ కేర్‌లో
 వడదెబ్బకు విలవిల్లాడే దేశాన్ని చూస్తూ
 ఈ సీజన్ గడిస్తే గాని చెప్పలేమంటూ
 ఆందోళనతో చెతులెత్తేస్తూందీ ప్రజాస్వామ్యం
 డాక్టర్ పి.బి.డి.వి.ప్రసాద్
 8186814532

Advertisement
Advertisement