రాందేవ్‌ బాబాకు వరాలపై వరాలు

27 Feb, 2016 16:16 IST|Sakshi
రాందేవ్‌ బాబాకు వరాలపై వరాలు

న్యూఢిల్లీ: ముక్కు మూసుకొని యోగా చేసుకునే బక్కపల్చని రాందేవ్ బాబాకు బీజేపీ పాలిత రాష్ట్రాలు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వరాల మీద వరాల వర్షం కురిపిస్తోంది. నాగపూర్‌లోని 600 ఎకరాల స్థలాన్ని రాందేవ్ బాబాకు చెందిన పతంజలి యోగ పీఠానికి అప్పగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్థలంలో రాందేవ్ బాబా ఆరెంజ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారట. 2010లో హిమాచల్‌లోని అప్పటి బీజేపీ ప్రభుత్వం 28 ఎకరాల స్థలాన్ని కేవలం 17 లక్షల రూపాయలకు 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చిన విషయం తెల్సిందే.
 
ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆయనకు దక్కుతున్న వరాలు అన్నీ ఇన్నీ కావు. అండమాన్‌లో ఓ యోగా రిసార్ట్ ఏర్పాటు చేయడం కోసం కేంద్రంలో షిప్పింగ్ శాఖ మంత్రిగా పని చేస్తున్న గడ్కారి ఏకంగా ఓ దీవినే రాసిచ్చారు. ఆయనకు ఇప్పటికే స్కాట్‌లాండ్‌లో పీస్ ఐలాండ్ అనే 900 ఎకరాల దీవి ఉంది. దీన్ని 2009లో ఓ ఎన్‌ఆర్‌ఐ జంట బహుమతిగా ఇచ్చింది. 2015, ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  యోగా సంబంధిత ఛారిటబుల్ ట్రస్టులను పన్నుల నుంచి మినహా ఇస్తున్నట్టు ప్రకటించారు. కేవలం రాందేవ్ బాబాను దృష్టిలో పెట్టుకొనే ఈ వరాన్ని ప్రకటించారనడంలో సందేహం లేదు. బాబా కంపెనీలు వందల కోట్ల రూపాయల లాభాలను గడిస్తున్నా ప్రధాని ప్రకటించిన పన్ను మినహాయింపులను ఉపయోగించుకోవడం ఆయన కంపెనీల్లో ఛారిటీ ఎంతుందో తెలుస్తోంది.

 అధికారంలోవున్న బీజేపీ ప్రభుత్వాన్ని అడ్డంగా వాడుకుంటున్న రాందేవ్ బాబా ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ను సమాంతరంగా వైదిక్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేస్తానని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ సమ్మతి కూడా ఉందని గత అక్టోబర్ నెలలో స్వయంగా ప్రకటించారు. అది ఈ ఏడాదిలో కార్యరూపం దాలుస్తుందని కూడా ఆయన అనుచరులు తెలియజేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం మంత్రి పదవి ఇస్తానన్న కాదన్న రాందేవ్ బాబా జెడ్ క్యాటగిరీ భద్రతను స్వీకరించారు. మంత్రికి ఇద్దరు గన్‌మెన్‌లుంటే ఈయనకు ఇప్పుడు 20 మంది గన్మెన్లు ఉన్నారు. విమానాశ్రయాల్లో ఎలాంటి తనికీ లేకుండా వెళ్లేందుకు అనుమతించే జాబితాలో తన పేరును చేర్చాలని కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 దేశంలో ఖాదీ మార్కెటింగ్ వ్యవస్థను కూడా తనకే అప్పగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇంకా ఆ కోరిక తీరాల్సి ఉంది. పతంజలి యోగా పీఠానికి చెందిన కంపెనీల ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి టైఅప్ కోసం ప్రతిష్టాకరమైన డీఆర్‌డీవో కూడా ముందుకు వచ్చిందంటే ప్రభుత్వంపై ఆయనకు ఎంత పట్టు ఉందో అర్థం అవుతుంది.  2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసినందుకే ప్రభుత్వం ఆయనకు ఇన్ని వరాలను ఇస్తుందా? అన్న విషయం స్పష్టం కావాలి. కాషాయరంగు గోచితో కనిపించే రాందేవ్ బాబా కంపెనీలకు 2015 సంవత్సరానికి రెండువేల కోట్ల రూపాయల రెవెన్యూ వచ్చినట్లు కంపెనీ రిటర్న్స్ తెలియజేస్తున్నాయి.

మరిన్ని వార్తలు