సాధారణం కంటే ఎక్కువ వర్షాలు

16 May, 2016 19:29 IST|Sakshi

హైదరాబాద్: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మే 29న కేరళ తీరాన్ని తాకుతాయని, దేశవ్యాప్తంగా సాధారణం కంటే కొంచెం ఎక్కువ మోతాదులో వర్షాలు పడతాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ స్పష్టం చేసింది. దీర్ఘకాలిక సగటు కంటే అయిదు శాతం ఎక్కువగా వానలు కురుస్తాయని, మరో ఐదు శాతం ఎక్కువ వర్షాలకు 20 శాతం వరకూ అవకాశముందని స్కైమెట్ అంచనా వేసింది. మే నెల 17వ తేదీకల్లా అండమాన్ సముద్రాన్ని చేరుకునే రుతుపవన మేఘాలు ఆ తరువాత 12 రోజులకు కేరళ తీరాన్ని తాకుతాయని స్కైమెట్ వాతావరణ నిపుణులు పల్వట్ మహేశ్ 'సాక్షి'కి తెలిపారు. రెండేళ్ల వర్షాభావానికి కారణమైన ఎల్ నినో ప్రభావం ఇప్పటికే తగ్గుముఖం పట్టగా, వచ్చే నెలకు సున్నా స్థాయికి చేరుకోనుంది.

దీంతో ఈ ఏడాది రుతుపవనాలకు మార్గం సుగమమైనట్లు ఆయన తెలిపారు. జూన్ 6వ తేదీకల్లా తెలంగాణ, 12వ తేదీకి ముంబైలను తాకుతాయని, జూలై పన్నెండు నాటికి దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశముందని ఆయన వివరించారు. మరోవైపు తూర్పువైపున కూడా రుతుపవనాలు చురుకుగా కదులుతాయని, జూన్ పదవ తేదీకల్లా కోల్‌కతాను తాకే అవకాశముందని చెప్పారు. రుతుపవనాలు దేశానికి ఇరువైపుల నుంచి నెమ్మదిగా ఎగబాకుతూ జూన్ నెలలో సాధారణ వర్షపాతం కంటే కొంచెం తక్కువ వర్షాలు కురిసినప్పటికీ జూలై, ఆగస్టుల్లో 110 శాతం మేరకు వానలు పడతాయని తెలిపారు. ఈ సీజన్‌లో తమిళనాడు, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు