‘ఈవీఎంల హ్యాకింగ్‌ అసాధ్యం’

12 Mar, 2019 12:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని మాజీ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నవీన్‌ చావ్లా సమర్ధించారు. ఇతర యంత్రాలతో వాటిని హ్యాక్‌ చేయడం కానీ, తారుమారు చేయడం కానీ సాధ్యపడదని స్పష్టం చేశారు. ఈవీఎంలు సీనియర్‌ ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో ఉంటాయని, అవకతవకలకు పాల్పడే అవకాశం ఉండబోదని పేర్కొన్నారు.

ఈవీఎంలు సమర్ధవంతమైన యంత్రాలనీ వాటిని నిర్వీర్యం చేసే అవకాశాలు లేవని తాను బలంగా నమ్ముతానని చావ్లా పేర్కొన్నారు. ఈవీఎం కేవలం రెండు మూడు విధులను నిర్వర్తించే డెస్క్‌టాప్‌ కాలిక్యులేటర్‌ వంటిదని, దీన్ని హ్యాక్‌ చేయలేరని తాను రాసిన పుస్తకం ’ఎవిరి ఓట్‌ కౌంట్స్‌’  ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ చావ్లా చెప్పారు.

ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఈవీఎం చిప్స్‌లను ఎవరైనా ఎలాగైనా మార్చేస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఇతర యంత్రాలను ఉపయోగిస్తూ ఏ ఒక్కరూ ఈవీఎం చిప్స్‌లను మార్చలేరని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఈవీఎంకూ వీవీప్యాట్‌లను అమర్చుతుండటంతో మొత్తం ఈవీఎం వ్యవస్థ మరింత జవాబుదారీగా మారుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు