దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు

14 Mar, 2019 04:12 IST|Sakshi

రఫేల్‌ రహస్య పత్రాల బహిర్గతంపై కేంద్రం అఫిడవిట్‌

ఆ సమాచారం ఆధారంగానే రివ్యూ    పిటిషన్లు వేశారని అభ్యంతరం

పోరాట సామర్థ్యం వివరాలు శత్రువులకు చేరాయని ఆక్షేపణ

న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్‌ ఒప్పంద పత్రాలు చోరీకి గురయ్యాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలుచేసింది. లీకైన రహస్య సమాచారం ఆధారంగానే పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారని తెలిపింది. ఫ్రాన్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అంతా సక్రమంగానే ఉందని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వగా, దానిని సమీక్షించాలని కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరి, న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ రివ్యూ పిటిషన్‌లు వేసిన సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో బుధవారం రక్షణశాఖ అఫిడవిట్‌ దాఖలుచేసింది.

రఫేల్‌ పత్రాలు బహిర్గతం కావడం దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టిందని రక్షణ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పేపర్లను నకళ్లు తీసినవారు దొంగతనానికి  పాల్పడ్డారని ఆరోపించింది. బలగాల పోరాట సామర్థ్యానికి సంబంధించిన ఈ సమాచారం విస్తృతంగా వ్యాపించి శత్రువుకు కూడా అందుబాటులోకి వచ్చిందని రక్షణ శాఖ ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అంతర్గత విచారణ ప్రారంభమైందని, లీకేజీ ఎక్కడ జరిగిందో కనుక్కోవడంపై ప్రధానంగా దృష్టిపెట్టామని కోర్టుకు తెలిపింది. ఈ అఫిడవిట్‌ గురువారం సుప్రీంకోర్టు ముందుకు రానుంది.

వారంతా ఐపీసీ కింద దోషులే
రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి చోరీకి గురైన పత్రాల ఆధారంగానే రివ్యూ పిటిషన్లు వేశారని మార్చి 6నే అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మళ్లీ రెండు రోజుల తరువాత మాటమారుస్తూ..పత్రాలు తస్కరణకు గురి కాలేదని, వాటి నకళ్లనే పిటిషన్‌దారులు ఉపయోగించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ వివరణ ఇస్తూ అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేంద్రం రఫేల్‌ గోప్యతను కాపాడుతున్నా..సిన్హా, శౌరి, భూషణ్‌లు సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేసి ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అందులో పేర్కొంది.

ఈ కుట్రలో పాలుపంచుకుని అనధికారికంగా ఆ పత్రాలను నకళ్లు తీసిన వారు ఐపీసీ చట్టం ప్రకారం దోషులేనని తెలిపింది. ఈ వ్యవహారంలో లీకేజీ ఎక్కడ జరిగిందో తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వ కీలక నిర్ణయాల గోప్యతను కాపాడతామని చెప్పింది. అనధికారికంగా, అక్రమంగా సేకరించి సమర్పించిన పత్రాలను కోర్టు రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది. రక్షణ శాఖ, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే ఆ సమాచారాన్ని సమాచార హక్కు చట్టం కింద బహిర్గతం చేయరాదని గుర్తు చేసింది.

మరిన్ని వార్తలు