వేర్పాటు నేతలకు భద్రత ఉపసంహరణ

17 Feb, 2019 12:20 IST|Sakshi

శ్రీనగర్‌ : పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని ఐదుగురు వేర్పాటువాద నేతలకు భద్రతను ఉపసంహరిస్తున్నట్టు ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది. వేర్పాటువాద నేతలు మిర్వాజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌, అబ్ధుల్‌ ఘనీ భట్‌, బిలాల్‌ లోన్‌, హషీం ఖురేషీ, షబీర్‌ షాలకు భద్రతను ఉపసంహరించినట్టు ప్రభుత్వం పేర్కొంది

కాగా ఈ జాబితాలో పాక్‌ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్‌ అలి షా గిలానీ పేరు లేకపోవడం గమనార్హం. వేర్పాటువాద నేతలకు కల్పించిన అన్ని భద్రతా వాహనాలు, సిబ్బందిని సాయంత్రానికి వెనక్కితీసుకోవాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వీరికి ప్రభుత్వం సమకూర్చిన ఇతర సౌకర్యాలనూ తక్షణం ఉపసంహరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

మరోవైపు ఇతర వేర్పాటువాద నేతలకూ భద్రత ఉపసంహరణపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. పుల్వామా జిల్లాలో గురువారం సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు