ఏకాభిప్రాయం కోసం కృషి

29 Jul, 2016 01:21 IST|Sakshi

జీఎస్టీపై కాంగ్రెస్, ఎస్‌పీ, సీపీఎం సహా పలు పార్టీల నేతలతో జైట్లీ చర్చలు
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లుపై ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ బిల్లును వచ్చే వారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో.. ప్రతిపక్షాలతో మాట్లాడి ఒప్పించటానికి కేంద్రం కృషి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా.. ప్రభుత్వ కృషి నిర్మాణాత్మకమైనది, సానుకూలమైనది అని కితాబునిచ్చింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం గురువారం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, సీపీఎం సహా పలు విపక్ష పార్టీల నేతలతో చర్చలు జరిపారు.

కాంగ్రెస్ నుంచి పి.చిదంబరం, ఆనంద్‌శర్మ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు జైట్లీతో రెండు విడతలుగా జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఎస్‌పీ నేత రాంగోపాల్‌యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలతో కూడా జైట్లీ చర్చలు జరిపారు. ఈ బిల్లు విషయమై ప్రభుత్వం అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల ఆర్థికావసరాలకు ఢోకా లేకుండా కేంద్రం చూసుకుంటుందని జీఎస్‌టీ బిల్లును తెచ్చే ముందుగా ఆయా రాష్ట్రాలకు భరోసా ఇవ్వాలని సీపీఎం, సీపీఐ, తృణమూల్, ఎస్పీ, బీజేడీ పార్టీల నేతలు జైట్లీకి సూచించారు.

ఈ చర్చలు నిర్ణయాత్మక దశకు చేరాయని.. సానుకూలమైన ఫలితం వస్తుందని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ఆశిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న జీఎస్‌టీ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, దానిని సవరించాల్సిన అవసరముందని చిదంబరం చెప్పారు. అయితే.. జీఎస్‌టీ బిల్లు అంశం ప్రభుత్వం, కాంగ్రెస్‌ల మధ్య ఆటగా మారిందని.. దీనిపై తమతో చర్చించిందేమీ లేదని సీపీఎం నేత ఏచూరి పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని మోదీ సైతం గురువారం రాజ్యసభలో ఎస్‌పీ నేతలు రాంగోపాల్‌యాదవ్, నీరజ్‌శేఖర్‌లతో మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు